Three Capitals Row: ఏపీ హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి ఝలక్, రాజధాని అంశంపై సెప్టెంబర్ 21 వరకు స్టేటస్ కో పొడగింపు, వచ్చే నెల నుంచి రోజువారీ విచారణ చేపడతామని స్పష్టం చేసిన న్యాయస్థానం
గురువారం హైకోర్టులో విచారణ ఉండటంతో ఈరోజు ఎలాంటి నిర్ణయం వెలువడుతుందోనని రాష్ట్రవ్యాప్తంగా ఒక ఉత్కంఠ నెలకొని ఉండగా, చివరకు గతంలో ఇచ్చిన స్టేటస్ కోను పొడగించేందుకే మొగ్గుచూపిన హైకోర్టు తదుపరి విచారణను సెప్టెంబర్ 21కి వాయిదా వేసింది....
Amaravati, August 27: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టం తదితర కీలక అంశాలపై రాష్ట్ర హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. రాజధాని తరలింపుని నిలుపుదల చేస్తూ హైకోర్ట్ గతంలో ఇచ్చిన స్టేటస్ కో గడువు ఈరోజుతో ముగియడంతో, మరోసారి విచారణ చేపట్టిన స్టేటస్ కోను సెప్టెంబర్ 21 వరకు పొడగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని బిల్లులను ప్రభుత్వం అమలు చేయకుండా స్టేటస్ కో కొనసాగుతుందని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి సెప్టెంబర్ 11 వరకు సమయం ఇచ్చింది. అలాగే ఏవైనా అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్ 17 వరకు నమోదు చేసుకోవచ్చని తెలిపింది.
సెప్టెంబర్ 21 నుంచి ఈ అంశంపై రోజూవారీ విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది. కొవిడ్ నిబంధనలు పాటిస్తే, కోర్టు హాలులోనే విచారణలు చేపట్టేందుకు తాము సిద్ధం అని మూడు సభ్యులతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
పరిపాలనను వికేంద్రీకరిస్తూ ఏపీకి మూడు రాజధానులు తీసుకురావాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ధృడ నిశ్చయంతో ఉన్న విషయం తెలిసిందే. అయితే దీనిని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలవడంతో ప్రభుత్వ నిర్ణయాల అమలును నిలుపుదల చేస్తూ హైకోర్ట్ 'స్టేటస్ కో' ఇచ్చింది. దీంతో హైకోర్ట్ ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది, అయితే ఈ అంశంపై తాము జోక్యం చేసుకోలేమని, హైకోర్ట్ పరిధిలోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేయడంతో కథ మళ్లీ హైకోర్ట్ వద్దకే వచ్చి చేరింది. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరోసారి నిరాశ, స్టేటస్ కో అంశంపై జోక్యం చేసుకోలేమని వెల్లడి
గురువారం హైకోర్టులో విచారణ ఉండటంతో ఈరోజు ఎలాంటి నిర్ణయం వెలువడుతుందోనని రాష్ట్రవ్యాప్తంగా ఒక ఉత్కంఠ నెలకొని ఉండగా, చివరకు గతంలో ఇచ్చిన స్టేటస్ కోను పొడగించేందుకే మొగ్గుచూపిన హైకోర్టు తదుపరి విచారణను సెప్టెంబర్ 21కి వాయిదా వేసింది.