Andhra Pradesh: 2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరివి, సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంతపురంలో సామాజిక న్యాయభేరి సభ విజయవంతమైందని వెల్లడి
సామాజిక న్యాయభేరి సభకు మహానాడుకి మించి ప్రజలు వచ్చారన్నారు. 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి గత ఎన్నికలకు మించి సీట్లు వస్తాయన్నారు.
Amaravati, May 31: అనంతపురంలో సామాజిక న్యాయభేరి సభ విజయవంతమైందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సామాజిక న్యాయభేరి సభకు మహానాడుకి మించి ప్రజలు వచ్చారన్నారు. 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి గత ఎన్నికలకు మించి సీట్లు వస్తాయన్నారు. కుప్పంలో మైనింగ్ మాఫియా జరుగుతోందని చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. కేవలం ఎన్నికల అస్త్రంగా చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు. 2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరివని మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.
ఇక చంద్రబాబు బీసీల ద్రోహి అని బీసీ నేత, వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. సీఎం జగన్ బీసీలను అభివృద్ధి చేస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. ఈ దేశంలో ఎవ్వరూ సీఎం జగన్‌లా బీసీలకు మేలు చేయలేదని.. 47 ఏళ్లలో బీసీలను ఇంతలా ప్రోత్సహించే సీఎంను చూడలేదని ఆయన అన్నారు. ‘‘బీసీల హక్కుల కోసం రాజ్యసభలో పోరాడాలని నాకు అవకాశం ఇచ్చారు.
చంద్రబాబుకి బీసీల ఓట్లు కావాలి.. కానీ వాళ్లు ఎదిగితే ఓర్వలేరు. చంద్రబాబు ఏనాడైనా బీసీలకు ఇన్ని మంత్రి పదవులు, రాజ్యసభ సీట్లు ఇచ్చారా?. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని ఎన్ని సార్లు అడిగినా బాబు స్పందించలేదు. బీసీలంతా ఎప్పటికీ సీఎం జగన్ వెంటే ఉంటారని ఆర్ కృష్ణయ్య అన్నారు.