IPL Auction 2025 Live

Mudragada Letter to Pawan Kalyan: గోచీ, మొలతాడు లేనివాళ్లతో తిట్టించడం మగతనం కాదు, పవన్ కళ్యాణ్‌పై లేఖలో మరోసారి విరుచుకుపడిన ముద్రగడ పద్మనాభం

ఇటీవల తాను విడుదల చేసిన లేఖతో మీ అభిమానులతో తనను బండ బూతులు తిట్టిస్తున్నారని, మెస్సేజ్‌లు పెట్టిస్తున్నారని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు.

Mudragada Padmanabham Again Letter to Pawan Kalyan over Remarks (Photo-File Image)

Kakinada, June 23: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మరో లేఖ విడుదల చేశారు. ఇటీవల తాను విడుదల చేసిన లేఖతో మీ అభిమానులతో తనను బండ బూతులు తిట్టిస్తున్నారని, మెస్సేజ్‌లు పెట్టిస్తున్నారని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. మీ మెస్సేజ్‌లకు లొంగిపోయే వ్యక్తిని కాదని, అది ఈ జన్మలో జరగదని లేఖలో కౌంటరిచ్చారు. ‘ మీరు సినిమాలో హీరో తప్పా.. రాజకీయాల్లో కాదు.. నన్ను తిట్టాల్సిన అవసరం మీకు, మీ అభిమానులకు ఎందుకొచ్చింది. నీ వద్ద నేను నౌకరిగా పనిచేయడం లేదు కదా.. అటువంటప్పుడు నన్ను తిట్టించాల్సిన అవసరం ఏంటి?’ అని ముద్రగడ ప్రశ్నించారు.

ఇంకా ముద్రగడ తన లేఖలో.. ‘‘మీ వద్ద నేనేమి నౌకరీ చేయడం లేదే? నాకు ఏ రకంగాను స్వంత అభిప్రాయలు ఉండకూడదా? మీకు తొత్తుగా ఉండాలా? మీకు నాకు సంబంధం ఏమిటి? మీకు డబ్బు ఉంది కాబట్టి మీ అభిమానుల చేత నన్ను తిట్టిస్తారా? నా శరీరంలో చీము, నెత్తురు లేకపోవడం వలన పౌరుషం పూర్తిగా పోయింది నేనొక అనాథను, ఒంటరి వాడిని ఏమన్నా పడతాననే గర్వమా? 1988లో వంగవీటి రంగాని హత్య చేసిన తరువాత ఎంతో మందిని అమాయకులను జైలులో పెట్టినప్పుడు ఎప్పుడైనా తమరు వెళ్ళి చూసారా? జైలులో ఉన్న వారి కుటుంబాలకు ధైర్యం చెప్పడం కోసం ఏ రోజైనా పలకరించడానికి వారి గృహాలకు వెళ్ళారా? గోచి మొలత్రాడు లేని వారితో నన్ను తిట్టిస్తున్నారు.. దమ్ముంటే మీరు నన్ను తిట్టండి. నేను మీ బానిసను కాదు మీ మోచేతి కింద నీళ్లు తాగడం లేదని మండిపడ్డారు.

జైలులో ఉన్న వారికి బెయిల్స్ తేవడం కోసం ఎప్పుడైనా అడ్వకేట్స్‌తో మాట్లాడారా? జైలులో ఉన్న వారి మీద టెర్రరిస్టుల కోసం తయారు చేసిన చట్టంలోని కొన్ని సెక్షన్లు వేసి కేసులు పెట్టిన సంగతి తమరెరుగుదురా?1988-89లో 3500 మంది అమాయకులపై పెట్టిన కేసులు తీసివేయమని ఎప్పుడైనా అప్పటి గౌరవ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి గారిని కలిసి కోరారా? 1993-94 లో రావులపాలెంలో అప్పటి ముఖ్యమంత్రి గారి సభలో కాపులను గొడ్డును బాధినట్లుగా బాదిన బాధితులను ఏరోజైనా పలకరించారా?1999 ఉద్యమ సందర్భముగా అప్పట్లో పెట్టిన కేసులు అప్పటి ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబునాయుడు గారిని తీసివేయమని అడిగారా?

కాకినాడ ఎమ్మెల్యేతో పాటు నన్ను తిట్టాలని ఎందుకు అనుకున్నారో సెలవివ్వాలి. ఆఖరిగా నా బలమైన కోరిక మీ ముందు పెడుతున్నాను. కాకినాడ ఎమ్మెల్యే గారు, నేను కోరినట్టుగా కాకినాడ నుండి పోటీ చేయడానికి మీరు నిర్ణయం తీసుకోండి. ఏ కారణం చేతనైనా తమరు తోక ముడిస్తే పిఠాపురం నుండి పోటీ చేయడానికి తమరు నిర్ణయం తీసుకుని నన్ను మీ మీదకు పోటీ చేయడానికి నాకు సవాలు విసరమని కోరుకుంటున్నానండి.

“చెగువేరా” మీకు ఆదర్శం అని చెప్పుకుంటారు. గుండెలనిండా ధైర్యం ఉందని అంటారు కాబట్టి ఏదో ఒక కోరిక తప్పకుండా తీర్చే శక్తి పౌరుషం మీకు ఉన్నాయని నేను భావిస్తాను. ఎన్నికల బరిలో ఉండాలా లేదా అనుకుంటున్న సమయంలో మీరు, జనసైనికులు తిట్టడం వల్ల ఎక్కడా లేని ఉత్సాహాం నాలో వచ్చి యుద్ధానికి రెడీ అవ్వాలనే వాతావరణం కల్పించినందుకు చాలా సంతోషం. బంతిని ఎంత గట్టిగా కొడితే అంత ఎత్తుకు లేస్తుందనే సంగతి మరువవద్దు’’ పేర్కొన్నారు.