AP Assembly Session 2022: అసెంబ్లీలో రాయలసీమ ఘోష వినిపించిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, వైఎస్సార్ సీఎం అయ్యాక రాయలసీమ వాసుల కష్టాలు తీర్చారని వెల్లడి
సభలో పలు ఆందోళనల అనంతరం అభివృద్ధి వికేంద్రీకరణ' అంశంపై స్వల్పకాలిక చర్చ చేపట్టారు.
Amaravati, Sep 15: అయిదు రోజుల పాటు కొనసాగనున్న ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు (AP Assembly Session 2022) నేడు ప్రారంభం అయ్యాయి. సభలో పలు ఆందోళనల అనంతరం అభివృద్ధి వికేంద్రీకరణ' అంశంపై స్వల్పకాలిక చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి (MLA Bhumana Karunakar Reddy) మాట్లాడారు. నాడు సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు ఒక ప్రాంతంలోనే అభివృద్ధి చేయాలని చూశారని ఆరోపించారు.
కానీ సీఎం జగన్ అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని చూస్తున్నారని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని తెలిపారు. జగన్ చిత్తశుద్ధితో వికేంద్రీకరణ ప్రతిపాదన తీసుకువచ్చారని భూమన కొనియాడారు. తమ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలన్న ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం అని, సీఎం జగన్ ఆ దిశగా గొప్ప ఆరంభాన్ని ఇస్తున్నారని వివరించారు.
అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం జగన్ కోరుకుంటుంటే.... టీడీపీ, చంద్రబాబుకు వత్తాసు పలికే మీడియా విషప్రచారం చేస్తున్నాయని భూమన విమర్శించారు. జగన్ విధానాలతో అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. రాయలసీమ, నెల్లూరు ప్రజలకు మద్రాసుతో భావోద్వేగ అనుబంధం ఉందని అన్నారు. ఆనాడు విడిపోవాలని ఎవరూ కోరుకోలేదని, రాయలసీమ ఆనాటి నుంచి నష్టపోతూనే ఉందని తెలిపారు. వైఎస్సార్ సీఎం అయ్యాక రాయలసీమ వాసుల కష్టాలు తీర్చే ప్రయత్నం చేశారని భూమన వివరించారు. కానీ, రాయలసీమ ప్రయోజనాలు కాపాడేందుకు చంద్రబాబు ఏనాడూ ముందుకు రాలేదని, సీమ ప్రజలను పట్టించుకోని చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు.
"రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలు ఉన్నాయి. రాయలసీమకు, కోస్తాంధ్రకు, ఉత్తరాంధ్ర ప్రజలకు విభిన్నమైన ఆలోచనలు ఉన్నాయి, అభివృద్ధిలో తేడాలు ఉన్నాయి, వాళ్ల మధ్యన విభిన్న సంస్కృతులు కూడా ఉన్నాయి. కానీ మనమందరం తెలుగువాళ్లుగా ఒక్కటిగా ఉండాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నది సీఎం జగన్ సదాశయం. అందుకే ఆయన వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారు" అంటూ భూమన ప్రసంగించారు.