Andhra Pradesh: ప్రజలు ఆవేశాలకు గురికావొద్దు, రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన డీజీపీ సవాంగ్, నేడు రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చిన టీడీపీ
టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలతో ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేత తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యాలయాలను ముట్టడించాయి. ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఏపీ డీజీపీ సవాంగ్ రెచ్చగొట్టేవారికి హెచ్చరికలు జారీ చేశారు.
Amaravati, Oct 20: టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలతో ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేత తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యాలయాలను ముట్టడించాయి. ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఏపీ డీజీపీ సవాంగ్ రెచ్చగొట్టేవారికి హెచ్చరికలు జారీ చేశారు.
రెచ్చగొట్టే వ్యాఖ్యల పట్ల ప్రజలు ఆవేశాలకు గురికావొద్దని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ (AP DGP Goutham Sawang) విజ్ఞప్తి చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని డీజీపీ అన్నారు. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోవద్దన్నారు. చట్టాన్ని అతిక్రమించినవారిపై కఠిన చర్యలుంటాయన్నారు. దాడులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అదనపు బలగాలు మోహరించామని, ప్రజలందరూ సంయమనం పాటిస్తూ సహకరించాలన్నారు.
టీడీపీ పార్టీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడి చేయడంపై చంద్రబాబు (Chandra babu Naidu) స్పందించారు. మంగళగిరిలో మీడియాతో నిన్న మాట్లాడారు. ఈ సమావేశంలో నేడు రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చారు. తాను సాధారణంగా బంద్ లకు పిలుపు ఇవ్వనని, కానీ నిన్న జరిగిన ఘటనలతో బంద్ కు పిలుపు ఇవ్వాల్సి వస్తోందని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని తెలిపారు. రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.
ఏనాడూ రాష్ట్రంలో 356 ఆర్టికల్ అమలు చేయాలని తమ పార్టీ గతంలో ఎప్పుడూ కోరలేదని, కానీ ఇవాళ్టి ఘటనల నేపథ్యంలో శాంతిభద్రతల వైఫల్యానికి ఇంతకంటే నిదర్శనం ఏముందో చెప్పాలని అన్నారు. గతంలో ఎక్కడైనా 356 ఆర్టికల్ అమలు చేసి ఉంటే, ఇంతకంటే బలమైన కారణాలు అక్కడ ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యంపైన జరిగిన దాడి కాదా? ప్రతి ఒక్క పార్టీ కూడా మాకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నా అని విజ్ఞప్తి చేశారు.
హెరాయిన్ గురించి మాట్లాడితే ఏమిటి తప్పు? అని ప్రశ్నించారు. ఏపీలో గంజాయి సాగు గురించి పొరుగు రాష్ట్రాల డీజీపీలు చెప్పారని వెల్లడించారు. రాష్ట్రంలో గంజాయి సాగు పెరిగిందని అనడమే టీడీపీ నేతలు చేసిన తప్పా అని నిలదీశారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఇవాళ్టి దాడులు జరిగాయని చంద్రబాబు ఆరోపించారు. తమకు కూడా కోపం, ఆవేశం, బాధ, తపన ఉన్నాయని... అయితే నిగ్రహించుకుంటున్నామని స్పష్టం చేశారు. దాడి విషయం తమకు తెలియదని అంటున్న డీజీపీ ఆ పదవికి అర్హుడా అని ప్రశ్నించారు.
నేను ఫోన్ చేసినా డీజీపీ ఎత్తలేదు. గవర్నర్, కేంద్రమంత్రి ఫోన్ ఎత్తారు కానీ, డీజీపీ ఎత్తడా? ఏమనుకుంటున్నారు. ఎన్ని బాధలున్నా నిగ్రహించుకుంటున్నాం. నా టెంపర్ మెంట్ లూజ్ చేసుకోవడానికి ఒక్క సెకను చాలు. నా ఇంటి గేటుకు తాళ్లు కట్టినప్పటి నుంచి ఈ అరాచకాలు ప్రారంభం అయ్యాయి. రెండున్నరేళ్లుగా మీ దాడులు చూస్తున్నాం... నా మనోధైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటున్నారు కానీ అది మీ వల్ల కాదు. ఈ దాడులను ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలి" అని చంద్రబాబు పేర్కొన్నారు.
సీఎంపై నారా లోకేశ్ వివాదాస్పద ట్వీట్లు
ఇక రాష్ట్రంలో టీడీపీ నేతల నివాసాలపై దాడులు, మంగళగిరిలో పార్టీ ప్రధాన కార్యాలయం ధ్వంసం ఘటనలపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్లో తీవ్రస్థాయిలో స్పందించారు. ఎన్నాళ్లు ఇలా ఇంట్లో దాక్కుని నీ కుక్కలతో దాడి చేయిస్తావు... నువ్వే రా తేల్చుకుందాం! అంటూ సవాల్ విసిరారు.
"ఇప్పటివరకు ముఖ్యమంత్రి అని గౌరవించేవాడ్ని. నీ వికృత, క్రూర బుద్ధి చూశాక సైకో, శాడిస్ట్, డ్రగ్గిస్ట్ జగన్ అని అంటున్నాను. నువ్వూ, నీ బినామీలు డ్రగ్స్ దందా చేస్తారు... ఆ విషయాలపై నిలదీసే టీడీపీ నేతలపై దాడులకు పాల్పడతావా?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు."నీ కార్యాలయాల విధ్వంసం మాకు నిమిషం పని. మా కార్యకర్తలు నీ ఫ్యాన్ రెక్కలు మడిచి, విరిచి నీ పెయిడ్ ఆర్టిస్టులను రాష్ట్రం దాటేంత వరకు తరిమికొడతారు" అంటూ హెచ్చరించారు. "ఆనవాయితీలన్నింటిని తుంగలో తొక్కి, ప్రజాస్వామ్యానికి పాతరేసి, నీ సమాధికి నువ్వే గొయ్యి తవ్వుకుంటున్నావు కోడికత్తిగా!" అంటూ ఘాటైన పదజాలం ఉపయోగించారు.
Here's Nara Lokesh Tweets
"తెలుగుదేశం సహనం చేతకానితనం అనుకుంటున్నావా? నీ పతనానికి ఒక్కో ఇటుకా నువ్వే పేర్చుకుంటున్నావు. పరిపాలించమని ప్రజలు అధికారం అందిస్తే పోలీసుల అండతో మాఫియా సామ్రాజ్యం నడుపుతావా? టీడీపీ కేంద్ర కార్యాలయంపై గూండా మూకలతో దాడులకు తెగబడతావా?" అంటూ లోకేశ్ మండిపడ్డారు. "నిన్ను ఉరికించి కొట్టడానికి టీడీపీ అధికారంలోకి రావాల్సిన పనిలేదు. నీ అరాచకాలపై ఆగ్రహంతో ఉన్న క్యాడర్ కు మా లీడర్ ఒక్క కనుసైగ చేస్తే చాలు" అంటూ స్పష్టం చేశారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)