AP Free Laptop Scheme 2021: ఏపీలో 6.53లక్షల మంది విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు, అమ్మఒడి పథకం కింద నగదు వద్దనుకునే స్టూడెంట్లకు పంపిణీ, ఏపీటీఎస్ ద్వారా టెండర్లను ఆహ్వానించిన ఏపీ ప్రభుత్వం
9వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతూ జగనన్న అమ్మఒడి, జగనన్న వసతి దీవెన కింద లబ్ధి పొందుతున్న విద్యార్థులకు ఆ పథకాలకు ప్రత్యామ్నాయంగా ( laptops instead of cash) ల్యాప్‌టాప్‌లను అందించనుంది. విద్యార్థుల అభీష్టం మేరకు ఆ పథకాల కింద నగదుకు బదులుగా ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేయనుంది.
Amaravati, Oct 28: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు స్కూలు స్థాయి నుంచే సాంకేతిక పరిజ్ఞానం అందించడం, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ఇంటి నుంచే ఆన్‌లైన్ అభ్యసనం కొనసాగించడానికి వీలుగా ప్రభుత్వం వారికి ఉచిత ల్యాప్‌టాప్‌లు (AP Free Laptop Scheme 2021) అందించేందుకు ఏర్పాట్లు చేపట్టింది. తమకు ల్యాప్‌టాప్‌లు కావాలని 6.53 లక్షల మంది విద్యార్థులు (YS Jagan govt to give 6.53 Lakh student laptops) ఆప్షన్లు ఇచ్చారు. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) ద్వారా టెండర్లను ఆహ్వానించింది. ఇప్పటికే టెండర్లపై జ్యుడీషియల్ ప్రివ్యూ పరిశీలన కూడా పూర్తయ్యింది.
9వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతూ జగనన్న అమ్మఒడి, జగనన్న వసతి దీవెన కింద లబ్ధి పొందుతున్న విద్యార్థులకు ఆ పథకాలకు ప్రత్యామ్నాయంగా ( laptops instead of cash) ల్యాప్‌టాప్‌లను అందించనుంది. విద్యార్థుల అభీష్టం మేరకు ఆ పథకాల కింద నగదుకు బదులుగా ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేయనుంది. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు సంబంధించి జగనన్న అమ్మఒడి కింద 44.48 లక్షల మంది తల్లులు లబ్ధి పొందుతున్నారు. వీరికి ఏటా రూ.15 వేలు చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. వారిలో 5.42 లక్షల మందికిపైగా నగదుకు బదులు తమ పిల్లలకు ల్యాప్‌టాప్‌లు కావాలని ఆప్షన్ ఇచ్చారు.
2021–22 విద్యా సంవత్సరంలో 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయనున్న 6,53,144 ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఏపీటీఎస్‌కు నోడల్ ఏజెన్సీగా బాధ్యతలు అప్పగించింది. జగనన్న అమ్మఒడి కింద 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు 5,42,365 బేసిక్ వెర్షన్ ల్యాప్‌టాప్‌లు అందిస్తారు. ఇక ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ చదివే విద్యార్థులకు జగనన్న వసతి దీవెన కింద ఇస్తారు. వీరికోసం ఒక రకం కాన్ఫిగరేషన్‌తో 19,853 ల్యాప్‌టాప్‌లను, వేరే కాన్ఫిగరేషన్‌తో మరో 90,926 ల్యాప్‌టాప్‌లను అందిస్తారు.
ఇక జగనన్న వసతి దీవెన కింద ఏటా ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్ధులకు రూ.15 వేలు, డిగ్రీ విద్యార్థులకు రూ.20 వేలు ప్రభుత్వం అందిస్తోంది. ఈ పథకం కింద 15.50 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. ల్యాప్‌టాప్‌ల్లో సమస్యలు వస్తే కంపెనీలు వారంలో వాటిని పరిష్కరించేలా ప్రభుత్వం స్పష్టమైన నిబంధనలు విధించింది. విద్యార్థులు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫిర్యాదులు అందించాలి. లెనోవో, హెచ్‌పీ, డెల్, ఏసర్ వంటి బ్రాండెడ్ ల్యాప్‌టాప్‌లను మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే ప్రభుత్వం అందించనుంది.
హైస్కూల్ విద్యార్థులకు అందించే ల్యాప్‌టాప్‌ల ప్రత్యేకతలు..
4జీబీ రామ్, 500 జీబీ హార్డ్ డిస్క్, 14 అంగుళాల స్క్రీన్, విండోస్ 10 (ఎస్డీఎఫ్ మైక్రోసాఫ్ట్), ఓపెన్ ఆఫీస్ (ఎక్సెల్ వర్డ్, పవర్ పాయింట్) కాన్ఫిగరేషన్‌లతో మూడేళ్ల వారెంటీతో అందిస్తారు.