Amaravati, Oct 28: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఏర్పాటుచేసిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ కేబినెట్ భేటీలో (Andhra Pradesh Cabinet Meet) పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపారు. సమావేశంలో అసెంబ్లీ సమావేశాలపై కూడా నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు ( Assembly session starts from november 17 ) నిర్వహించనున్నారు. కాగా, ఈ సాయంత్రం సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan) గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌తో సమావేశం కానున్నారు.
రైతులకు 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్ అందించేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. యూనిట్‌కు రూ.2.49 చొప్పున ఏడాదికి 17 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. అలాగే సినిమాటోగ్రఫీ చట్టసవరణ ప్రతిపాదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2021 జనాభా గణనలో బీసీ జనాభాను కులాల వారీగా గణించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసే ప్రతిపాదనకు నేడు జరిగిన కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపింది. అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కొత్తగా జైన్ కార్పొరేషన్, సిక్కు కార్పొరేషన్ ఏర్పాటు, వైద్య, ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ, రాష్ట్రంలో 5చోట్ల సెవన్ స్టార్ పర్యాటక రిసార్ట్‌ల ఏర్పాటు కోసం భూముల కేటాయింపు వంటి అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. పీపీపీ విధానంలో శిల్పారామం అభివృద్ధి, విశాఖలో తాజ్ వరుణ్ బీచ్ ప్రాజెక్టు, జయలక్ష్మీ నరసింహ శాస్త్రి గుండ్లూరు ట్రస్ట్‌కు, అనంతపురం జిల్లా బొమ్మేపర్తిలో 17.49 ఎకరాల కేటాయింపు, శ్రీశారదా పీఠానికి కొత్త వలసలో 15 ఎకరాల కేటాయింపు వంటి అంశాలను చర్చించిన కేబినెట్ వాటికి ఆమోదం తెలిపింది.
సమావేశం అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. అమ్మఒడి పథకానికి 75 శాతం హాజరు తప్పనిసరి అన్నారు. దీనిపై విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించారు. అర్హత ఉన్నవారందరికీ సంక్షేమపథకాలు అందిస్తాం అని తెలిపారు. అంతేకాక బీసీ జనగణన చేసేలా అసెంబ్లీలో తీర్మానానికి కేబినెట్ ఆమోదం తెలిపామన్నారు. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపాలని నిర్ణయించామన్నారు. 1947 తర్వాత కుల ప్రాతిపదికన జనగణన జరగలేదు అని మంత్రి పేర్ని నాని తెలిపారు.