COVID Guidelines in AP: కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కీలక ఉత్తర్వులు, బూస్టర్ డోసుపై గైడ్ లైన్స్ విడుదల, జనవరి 1 నుంచి వాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ

బూస్టర్ డోసు,15-18 ఏళ్ల వయసు గల వారికి వాక్సినేషన్ ప్రక్రియపై గైడ్ లైన్స్ (COVID Guidelines in AP) విడుదల చేసింది. 15-18 ఏళ్లు దాటిన వారికి జనవరి ఒకటి నుంచి వాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ( vaccination process) ప్రారంభం కానుంది.

COVID-19 Study Representative Image (Photo Credits: Pixabay)

Amaravati, Dec 30: టీనేజర్లకి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బూస్టర్ డోసు,15-18 ఏళ్ల వయసు గల వారికి వాక్సినేషన్ ప్రక్రియపై గైడ్ లైన్స్ (COVID Guidelines in AP) విడుదల చేసింది. 15-18 ఏళ్లు దాటిన వారికి జనవరి ఒకటి నుంచి వాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ( vaccination process) ప్రారంభం కానుంది. 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వరకు వయసు గల వారికి 2022 జనవరి 3 నుంచి వాక్సినేషన్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు కోవిడ్‌ టీకా వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం (AP government) కసరత్తు చేపట్టింది. జనవరి 3వ తేదీ నుంచి 15–18 ఏళ్ల పిల్లలకు తొలి డోసు వేయనుంది. 10వ తేదీ నుంచి 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు, వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి, హెల్త్‌కేర్, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు ప్రికాషన్‌ డోసు టీకాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ విభాగాల్లో మొత్తంగా రాష్ట్రంలో 74,34,394 మందికి టీకాలు పంపిణీ చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా టీకా పంపిణీకి వైద్య, ఆరోగ్య శాఖ సన్నద్ధం అవుతోంది. 15–18 ఏళ్ల పిల్లలు టీకా కోసం జనవరి 1వ తేదీ నుంచి కోవిన్‌ యాప్‌/పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ఏపీలో ఒక్కసారిగా పెరిగిన ఒమిక్రాన్ కేసులు, ఒక్కరోజే అత్యధికంగా 10 కేసులు నమోదు, రాష్ట్రంలో 16కు చేరుకున్న కొత్త వేరియంట్ సంఖ్య

టీకా వేసుకునేందుకు అర్హులైన పిల్లలు రాష్ట్రంలో 24,41,000 మంది ఉన్నారు. 60 ఏళ్లు పైబడి వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారు 29,42,020 మంది, హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు 20,51,374 మంది ఉన్నారు. పిల్లలకు కోవాగ్జిన్‌ టీకా మాత్రమే వేస్తారు. 60 ఏళ్లు పైబడి రక్తపోటు, మధుమేహం, కిడ్నీ, గుండె సంబంధిత, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు వ్యక్తిగత వైద్యుడి సూచన మేరకు ప్రికాషన్‌ డోసు తీసుకోవాల్సి ఉంటుంది.

టీకా పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రస్తుతం ఉన్న విధానంలోనే టీకాలు వేసే కార్యక్రమం జరుగుతుంది. జిల్లాల్లో ఇప్పటికే 7 లక్షల టీకా డోసులు ఉన్నాయి. మరో 10 లక్షలు పంపాం. టీకా పంపిణీకి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశామని వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ తెలిపారు.