AP Govt Covid 19 New Guidelines: ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం, ఒమిక్రాన్ నేపథ్యంలో కఠిన నిబంధనలు జారీ, మాస్క్ లేకుండా రానిస్తే రూ.10 వేల నుంచి రూ. 25 వేల వరకు జరిమానా
మాస్క్ లేకుండా తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
అమరావతి, డిసెంబర్ 10: కరోనా కట్టడిలో భాగంగా ఏపీ ప్రభుత్వం నిబంధనలు మరింత కఠినతరం చేసింది. మాస్క్ లేకుండా తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరికలు జారీ చేసింది. కార్యాలయాలు, సంస్థలు, వ్యాపార సముదాయాలు, దుకాణాల్లోకి మాస్క్‌లు లేని వారిని అనుమతిస్తే రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే ఎపిలో కోవిడ్ వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం మరోమారు మార్గ దర్శకాలు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం ,డబ్లుహెచ్‌వో మార్గ దర్శకాలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించనివారికి రూ.100 జరిమానా వేయనున్నారు.
మాస్క్ లేకుండా ప్రజలను అనుమతించిన దుకాణాలు, వాణిజ్య ప్రదేశాలు, వ్యాపార సంస్థలకు రూ.10,000 నుంచి రూ.25,000వరకు జరిమానా విధించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ మార్గ దర్శకాలను ఉల్లంఘిస్తే జరిమానాతోపాటు రెండ్రోజులపాటు వ్యాపార సంస్థలను మూసివేసేలా అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఉద్ధేశపూర్వకంగా ఉల్లంఘనలు జరిగితే విపత్తు నిర్వహణ, ఐపిసి సెక్షన్ 188 ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కరోనా నిబంధనల ఉల్లంఘనలపై వాట్సాప్ ద్వారా 8010968295 నంబరుకు ప్రజలు ఫిర్యాదు చేయొచ్చని సూచించింది. ప్రభుత్వ మార్గదర్శకాల అమలును పర్యవేక్షించాల్సిందిగా జిల్లా కలెక్టర్, ఎస్పీలు, సీపీలను ఆదేశించింది.