Chandrababu's CID Case Update: సీఐడి విచారణపై నాలుగు వారాల స్టే ఇచ్చిన ఏపి హైకోర్ట్, చంద్రబాబు మరియు నారాయణకు తాత్కాలిక ఊరట, అప్పుడే ఇంకా ఏం అయిపోలేదంటున్న ఆర్కే
ఎలాంటి ఆధారాలు లేని ఈ కేసును కొట్టివేయాలని కొట్టివేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. శుక్రవారం ఈ కేసుపై రాష్ట్ర హైకోర్ట్ విచారించింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్ట్ సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూథ్రా....
Amaravathi, March 19: అమరావతిలోని అసైన్డ్ భూముల వ్యవహారంలో ఏపి మాజీ సీఎం చంద్రబాబు మరియు మాజీ మంత్రి నారాయణ లపై సీఐడి విచారణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ శుక్రవారం స్టే విధించింది. ఆ ఇద్దరిపై సీఐడీ నమోదు చేసిన కేసు విచారణను నాలుగు వారాల పాటు నిలుపుదల చేస్తూ హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.
చంద్రబాబు హయాంలో రాజధాని ప్రాంతంలో భారీ భూకుంభకోణం జరిగిందని, దళితులను భయపెట్టి వారి భూములను దౌర్జన్యంగా తక్కువ రేట్లకే కొనుగోలు చేశారని ఆరోపిస్తూ మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంట్ ఆనాటి ఏపి సీఎం చంద్రబాబు మరియు మాజీ మంత్రి నారయణలపై 41 సిఆర్‌పిసి చట్టం కింద కేసులు నమోదు చేసింది. వీరిద్దరూ ఈనెల 23న విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
అయితే, తమపై సీఐడీ నమోదు చేసిన కేసులను సవాల్ చేస్తూ చంద్రబాబు మరియు నారాయణలు హైకోర్టును ఆశ్రయించారు. జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాల గొంతునొక్కడానికి అర్థంలేని కేసులు వేస్తున్నారని హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఎలాంటి ఆధారాలు లేని ఈ కేసును కొట్టివేయాలని పిటిషన్లో పేర్కొన్నారు.
శుక్రవారం ఈ కేసును రాష్ట్ర హైకోర్ట్ విచారించింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్ట్ సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూథ్రా, అలాగే నారాయణ తరఫున హైకోర్ట్ సీనియర్ లాయర్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు.
ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, ఈ కేసుకు సంబంధించి నాలుగు వారాల్లో స్పష్టమైన స్కాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించాలని ఏపి సీఐడిని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు వారిని విచారించకూడదని స్టే విధించింది.
హైకోర్ట్ ఉత్తర్వులతో చంద్రబాబు, నారాయణలను అరెస్ట్ చేస్తారా? అని రాష్ట్రంలో నెలకొన్న ఉత్కంఠతకు తెరపడింది.
ఇక, హైకోర్ట్ స్టే ఇవ్వడం పట్ల టీడీపీ శ్రేణులు 'న్యాయం తమవైపే' , గెలుపు తమదేనంటూ సంబరాలు చేసుకుంటుండగా, ఫిర్యాదుదారుడు ఆళ్ల రామక్రిష్ణారెడ్డి మాత్రం ఇంకా ఏం అయిపోలేదని, నాలుగు వారాల్లో ఈ కేసుకు సంబంధించి అన్ని ఆధారాలు తాను సీఐడికి సమకూరుస్తానని పేర్కొన్నారు. ఈ కేసు నుంచి చంద్రబాబు తప్పించుకోలేరని, అవసరమైతే తాను సుప్రీంకోర్టు వరకు వెళ్లడానికి సిద్ధమేనని ఆయన తేల్చి చెప్పారు.