CBI Notice To Avinash Reddy: వివేకా హత్యకేసులో అవినాష్ రెడ్డి చుట్టు బిగుస్తున్న ఉచ్చు, రెండోసారి సీబీఐ నోటీసులు, ఈ నెల 24న విచారణకు హాజరుకావాలంటూ పిలుపు
గత నెల 28న ఆయన హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరైన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఈనెల 24వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు హైదరాబాద్‌లోని కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సీబీఐ అధికారులు వాట్సప్ ద్వారా అవినాష్‌రెడ్డికి నోటీసులు పంపారు.
New Delhi, FEB 18: మాజీ మంత్రి వివేకానందరెడ్డి (Vivekananda murder) హత్య కేసులో కడప ఎంపీ వై.ఎస్.అవినాష్‌రెడ్డికి (Avinash reddy) శనివారం సీబీఐ (CBI) మరోసారి నోటీసులు జారీ చేసింది. గత నెల 28న ఆయన హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరైన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఈనెల 24వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు హైదరాబాద్‌లోని కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సీబీఐ అధికారులు వాట్సప్ ద్వారా అవినాష్‌రెడ్డికి నోటీసులు పంపారు. తనకు నోటీసులు అందిన విషయం వాస్తవమేనని ఎంపీ అవినాష్‌రెడ్డి ధ్రువీకరించారు. మొదటి సారి విచారణ సమయంలో కడప ఎంపీ కాల్ డేటా ఆధారంగా సుదీర్ఘంగా విచారణ జరిపిన సీబీఐ అధికారులు.. ఇప్పుడు రెండోసారి మరిన్ని విషయాలపైన విచారించే అవకాశముంది. అవినాష్ రెడ్డి ఫోన్‌కాల్ డేటా (Call Date) ఆధారంగా వివేకా హత్య జరిగిన రోజు తాడేపల్లి కార్యాలయంలో పనిచేసే నవీన్, సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి మొబైల్స్‌కు ఫోన్ చేసినట్టు సీబీఐ అధికారులు గుర్తించారు.
నవీన్, కృష్ణ మోహన్ రెడ్డిని కూడా ఈనెల మొదటి వారంలో కడపలో సీబీఐ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. వారిచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఇప్పుడు రెండోసారి అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారణకు పిలవడం చర్చనీయాంశమైంది. 2019 మార్చి 15న వివేకా హత్య జరిగినప్పటి నుంచి.. ప్రతిపక్షాల వేళ్లన్నీ ఎంపీతో పాటు ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి వైపే చూపిస్తున్నాయి. 2020 మార్చి 11న హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు చేపట్టి 248 మంది సాక్షులు, అనుమానితులను విచారించి.. వాంగ్మూలాలను రికార్డు చేసింది. ఆ వాంగ్మూలాలు, సేకరించిన ఆధారాలతో ఇప్పుడు కీలకమైన అవినాష్‌రెడ్డిని విచారిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో వివేకా కేసు హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ అయినందున విచారణ ముమ్మరం చేయాలని కేంద్ర దర్యాప్తు సంస్థ భావిస్తోంది.
వివేకా దారుణ హత్యకు గురికాగా, గుండెపోటుతో చనిపోయారని దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ద్వారా ప్రచారం చేయించినా.. మృతదేహం వద్ద రక్తపు మరకలు, సాక్ష్యాధారాలు చెరిపేస్తున్నా.. పులివెందుల సీఐ శంకరయ్యని శివశంకర్‌రెడ్డి బెదిరిస్తున్నా.. ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి అడ్డుకోలేదనే ఆరోపణలను అవినాష్‌రెడ్డి ఎదుర్కొంటున్నారు. 2019 ఎన్నికల్లో కడప ఎంపీ టికెట్ అవినాష్‌రెడ్డికి కాకుండా.. షర్మిలకో, విజయమ్మకో లేదంటే తనకో ఇవ్వాలనేది వివేకా పట్టుదల. ఇది తెలిసే అవినాష్‌రెడ్డి కుటుంబం కుట్రకు పాల్పడి ఉంటుందనే అనుమానాలను సీబీఐ వ్యక్తం చేస్తోంది.