Chandrababu Health Update: చంద్రబాబు కంటికి రేపు క్యాటరాక్ట్ ఆపరేషన్, నేడు కూడా ఏఐజీ ఆసుపత్రిలో పలు రకాల వైద్య పరీక్షలు
ఆసుపత్రి వైద్యులు ఈరోజు మరోసారి ఆయనకు పలు వైద్య పరీక్షలను నిర్వహించనున్నారు.
Hyd, Nov 6: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రి వైద్యులు ఈరోజు మరోసారి ఆయనకు పలు వైద్య పరీక్షలను నిర్వహించనున్నారు. దీంతో పాటుగా చర్మ సంబంధిత సమస్యలకు చికిత్స చేయనున్నారు. ఇప్పటికే రెండు రోజుల పాటు ఏఐజీలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు జరిగాయి.
ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో కంటి పరీక్షలు కూడా చేయించుకున్నారు. రేపు ఆయన కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ జరగనుంది. వైద్య చికిత్సల కోసం చంద్రబాబుకు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. స్కిల్ కేసులో ప్రస్తుతం ఆయన బెయిల్ పై బయట ఉన్నారు.
ఇదిలా ఉంటే ఫైబర్ నెట్ కేసులో ఆస్తుల అటాచ్ మెంట్ పై నేడు ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేయనుంది. చంద్రబాబు, సన్నిహితులకు చెందిన 7 ఆస్తుల అటాచ్ మెంట్‌కు సీఐడీ ప్రతిపాదన చేయనున్నట్లు సమాచారం. సీఐడీ ప్రతిపాదనకు ఇప్పటికే అనుమతి ఇస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ-జనసేన పొలిటికల్ యాక్షన్ కమిటీ సభ్యులు నిన్న భేటీ అయ్యారు. మళ్లీ ఈ నెల 9న జనసేన, టీడీపీ సమన్వయ కమిటీ భేటీ కానుంది. ఉమ్మడి కార్యాచరణ దిశగా అడుగులు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. నిన్ భేటీలో ఉమ్మడి పోరాటం, ఉమ్మడి మేనిఫెస్టో క్షేత్రస్థాయి నుంచి సమన్వయం వంటి మూడు అంశాలపై ప్రధానంగా చర్చలు జరిగాయి.