Criminal Case Against Chandrababu: చంద్రబాబుపై నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదు, కర్నూలులో ఎన్‌440కే కరోనా వేరియంట్‌ పుట్టిందని తెలిపిన టీడీపీ అధినేత, ప్రజలు భయాందోళనలకు గురయ్యేలా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు

కర్నూలు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మాసుపోగు సుబ్బయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాబుపై కేసు నమోదు చేసినట్లు కర్నూలు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ కళా వెంకట్రమణ తెలిపారు.

N. Chandrababu Naidu. (Photo Credits: ANI/File)

Amaravati, May 8: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై ఫేక్ వార్తను ప్రచారం చేశాడనే ఆరోపణల మధ్య కర్నూలులో క్రిమినల్‌ కేసు (Criminal case against Chandrababu Naidu) నమోదైంది. కర్నూలు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మాసుపోగు సుబ్బయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాబుపై కేసు నమోదు చేసినట్లు కర్నూలు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ కళా వెంకట్రమణ తెలిపారు.

చంద్రబాబు ఈ నెల 6వ తేదీ టీవీ చానెల్స్‌తో మాట్లాడుతూ కర్నూలు కేంద్రంగా ఎన్‌440కే కరోనా వేరియంట్‌ (N440K coronavirus strain) పుట్టిందని, అది 10 నుంచి 15 రెట్లు వేగంగా వ్యాప్తి చెంది మానవనష్టం జరుగుతుందంటూ సామాన్య ప్రజలు భయాందోళనలకు గురయ్యేలా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనివల్ల కర్నూలు ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలిపోవడానికి సిద్ధపడుతున్నారని, ఇతర ప్రాంతాల ప్రజలు ఇక్కడికి రావడానికి భయపడుతున్నారని తెలిపారు.

అంతర్రాష్ట్ర సర్వీసులను పూర్తిగా రద్దు చేసిన ఏపీఎస్ఆర్టీసీ, కరోనా సెకండ్‌ వేవ్‌తో భారీగా తగ్గిన ఆదాయం, పార్సిల్‌ సర్వీసులు నిరంతరాయంగా కొనసాగేలా చర్యలు, ఏపీలో కొనసాగుతున్న కర్ఫ్యూ

కర్నూలు, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ముఖ్యంగా స్త్రీలు, చిన్నపిల్లలు భయపడి, మానసిక ఒత్తిడికిలోనై చనిపోవడానికి చంద్రబాబు మాటలు కారణమవుతున్నాయని పేర్కొన్నారు. ఎన్‌440కే వేరియంట్‌ అంత ప్రమాదకారికాదని సీసీఎంబీ కూడా తేల్చి చెప్పిందని తెలిపారు. చంద్రబాబు దుష్ప్రచారంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, అందువల్ల కేసు నమోదు చేసి విచారించాలని కోరారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా కర్నూల్లో చంద్రబాబుపై ఐపీసీ 155, 505(1)(బి)(2) సెక్షన్ల కింద కేసు (క్రైం నెం.80/2021) నమోదు చేశారు. అలాగే 2005 ప్రకృతి వైపరీత్యాల చట్టంలోని సెక్షన్‌ 4 కింద నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.