JD Laxmi Narayana Political Party: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ సంచలన నిర్ణయం, నూతన రాజకీయ పార్టీ పేరు, జెండా ఆవిష్కరణ, పార్టీ ప్రధాన ఎజెండా ఇదే!
సీబీఐ మాజీ జాయింట్ డైరక్టర్ లక్మీ నారాయణ (Laxmi Narayana) కొత్త పార్టీని ప్రకటించారు. తన పార్టీకి ‘జై భారత్ నేషనల్ పార్టీ’ (Jai Bharat National Party) అని నామకరణం చేశారు
Vijayawada, DEC 22: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొత్త రాజకీయ పార్టీ (Political Party) ఏర్పాటైంది. సీబీఐ మాజీ జాయింట్ డైరక్టర్ లక్మీ నారాయణ (Laxmi Narayana) కొత్త పార్టీని ప్రకటించారు. తన పార్టీకి ‘జై భారత్ నేషనల్ పార్టీ’ (Jai Bharat National Party) అని నామకరణం చేశారు. శుక్రవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగానికి ప్రధాన కారణం ప్రత్యేక హోదా లేకపోవడమే అని.. తమ పార్టీ ప్రత్యేక హోద తీసుకొచ్చేందుకు కృషి చేస్తుందని అన్నారు. పార్టీ ఏర్పాటుకు ముందు తాను అన్ని వర్గాలను కలిశానని, అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే రాజకీయ పార్టీని ఏర్పాటు చేశానని లక్ష్మీనారాయణ చెప్పుకొచ్చారు.
రాజకీయాలు అంటే మోసం కాదని.. సుపరిపాలన అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక సాధన విషయంలో అన్ని పార్టీలు విఫలమయ్యాయని ఆరోపించారు. రాష్ట్రంలో వీళ్లు తిన్నారని వాళ్లు, వాళ్లు తిన్నారని వీళ్లూ ఆరోపణలు చేసుకోవడం తప్ప సాధించిందేమీ లేదని అన్నారు. ఎవరూ అవినీతికి పాల్పడలేని వ్యవస్థను తీసుకొచ్చేందుకే తాను రాజకీయ పార్టీని స్థాపించానని, అభివృద్ధితో అవసరాలను తీర్చేందుకు, బానిసత్వాన్ని రూపుమాపేందుకే తమ పార్టీ పుట్టిందని ఆయన చెప్పారు.