Hyderabad Bonalu Festival: పాతబస్తీ బోనాల ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు, ఈ ఏడాది హైదరాబాద్ బోనాల కోసం రూ. 90 కోట్ల నిధులు, కోవిడ్ నేపథ్యంలో ప్రత్యేక హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించిన మంత్రి తలసాని
ఈ ఏడాది బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వం మొత్తం 90 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందని, ఇందులో 15 కోట్ల రూపాయలు వివిధ ఆలయాలకు ఆర్ధిక సహాయం క్రింద, మరో 75 కోట్ల రూపాయలను...
Hyderabad, July 12: ఆగస్టు 1వ తేదీన నిర్వహించే పాతబస్తీ బోనాల ఉత్సవాల ఏర్పాట్ల కోసం 7 కోట్ల రూపాయలతో వివిధ పనులను చేపట్టడం జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. పాత బస్తీ బోనాల నిర్వహణ, ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులు, ఉత్సవాల నిర్వహకులు, ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ సభ్యులతో సాలార్జంగ్ మ్యూజియంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పే ఆషాడ బోనాల ఉత్సవాలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు చెప్పారు. బోనాల సందర్భంగా ఆలయాలకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు. పాతబస్తీ బోనాల ఉత్సవాలలో భాగంగా వివిధ అభివృద్ధి పనులు, భక్తులకు కనీస వసతులు కల్పించడం వంటి 132 పనుల కోసం 7 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అమ్మవార్లకు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించడం జరుగుతుందని అన్నారు.
ఎప్పటికప్పుడు ఆలయాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని జోనల్ కమిషనర్ సామ్రాట్ అశోక్ ను మంత్రి ఆదేశించారు. రహదారుల మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ సూచించారు. కరోనా నేపద్యంలో శానిటైజేషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. అదేవిధంగా ప్రత్యేక హెల్త్ క్యాంప్ లను కూడా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.
భక్తులు ఉత్సవాలను వీక్షించేలా LED స్క్రీన్ లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో బోనాల ఉత్సవాలను నిర్వహించడంలో పోలీసులపాత్ర ఎంతో కీలకమని అన్నారు. ప్రస్తుతం ఉన్న CC కెమెరాలకు అదనంగా అవసరమైన ప్రాంతాలలో మరికొన్ని బోనాల ఉత్సవాలు ముగిసే వరకు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
ఈసారి బోనాల ఉత్సవాలకు ముందే ఆర్ధిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఈ ఏడాది బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వం మొత్తం 90 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందని, ఇందులో 15 కోట్ల రూపాయలు వివిధ ఆలయాలకు ఆర్ధిక సహాయం క్రింద, మరో 75 కోట్ల రూపాయలను బోనాల ఉత్సవాల ఏర్పాట్ల కోసం ఖర్చు చేస్తున్నట్లు వివరించారు.