AP 'Local' Polls: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్ట్ అనుమతి, జెడ్పీటీసీ మరియు ఎంపీటీసీ ఎన్నికల కోసం జనవరి 17 లోపు వెలువడనున్న నోటిఫికేషన్, పూర్తి షెడ్యూల్, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి

రాష్ట్రంలోని 660 జెడ్‌పిటిసి, 660 మండల పరిషత్ మరియు 10,229 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 12,951 గ్రామ పంచాయతీ ఎన్నికలు....

File image of High Court of Andhra Pradesh | File Photo

Amaravati, January 8:  ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థలకు ఎన్నికలు (AP Local Bodies Election) నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్ట్ (High Court of Andhra Pradesh)  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల సంఘం దాఖలు చేసిన అఫిడవిట్‌ను అంగీకరించిన హైకోర్టు మార్చి 3 లోగా మొత్తం ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది.

హైకోర్టుకు ఈసీ (Election Commission) దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికలకు జనవరి 17 లోగా నోటిఫికేషన్ వెలువడాలి, ఫిబ్రవరి 8న ఎన్నికలు జరుగుతాయి. వాటి ఫలితాలు ఫిబ్రవరి 10న ప్రకటించబడతాయి. మండల పరిషత్ అధ్యక్షుడు మరియు జిల్లా పరిషత్ చైర్మన్ ఫిబ్రవరి 15 లోగా ఎన్నుకోబడతారు.

ఫిబ్రవరి 8- మార్చి 3 మధ్య గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి చేస్తామని ఈసీ తెలిపింది. ఈ మేరకు ఫిబ్రవరి 8న పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అవుతుంది మరియు మార్చి 3 నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది.

ఇక అత్యున్నత న్యాయస్థానం స్థానిక సంస్థల ఎన్నికలకు ఆమోదం తెలపడంతో ఏపీలో మళ్ళీ ఎన్నికల వేడి మొదలైంది. రాష్ట్రంలోని 660 జెడ్‌పిటిసి, 660 మండల పరిషత్ మరియు 10,229 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

రాష్ట్రంలోని 12,951 గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ మరియు ఫలితాల ప్రకటన.

ఎన్నికల ప్రక్రియలో భాగంగా జనవరి 10న ఉన్నతాధికారులతో మరియు జనవరి 13న రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం సమావేశం కానుంది.