Operation Vasista Resumes: గోదావరిలో మునిగిపోయిన బోట్ ఆచూకీ లభ్యం? కచ్చులూరు వద్ద లంగరుకు బోటు తగిలినట్లు చెప్తున్న ధర్మాడి సత్యం బృందం, వెలకితీత పనులు తిరిగి ప్రారంభం

ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి దాదాపు 500 మీటర్ల దూరం వరకు బోటు కొట్టుకుపోయిందని చెప్తున్నారు....

Godavari boat Tragedy live updates:Search continues for missing people ( Photo credit - ANI /Twitter )

Amaravathi, October 16: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గత నెల సెప్టెంబర్ 15న మునిగిపోయిన బోటు రాయల్ వశిష్ట (Royal Vasista) బోటు వెలికితీత కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గోదావరి నదిలో వరద ఉదృతి ఎక్కువగా ఉండటంతో రెండు వారాల కిందట ఆపరేషన్ వశిష్ట పనులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వరద తగ్గుముఖం పట్టి, వాతావరణం అనుకూలంగా ఉండటంతో బోటు వెలికితీత పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇందుకోసం ఒక ప్రొక్లెయిన్, భారీ లంగరు (Anchor), 3వేల అడుగుల పొడుగున్న ఇనుపరోప్, 700 అడుగుల పొడవున్న నైలాన్ తాడు సహాయంతో బోటు వెలికితీత కోసం వినియోగిస్తున్నారు. ఈరోజు బోటు ఉన్న చోటును గుర్తించినట్లు ధర్మాడి సత్యం (Dharmadi Sathyam) బోటు బృందం వెల్లడించింది. ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి దాదాపు 500 మీటర్ల దూరం వరకు బోటు కొట్టుకుపోయిందని చెప్తున్నారు. నీటిలో వదిలిన లంగరుకు బోటు తగిలినట్లు సత్యం బృందం చెప్తున్నారు. అయితే ఇనుప రోప్ ను ప్రొక్లెయిన్ కు కట్టి లాగడం వలన లంగరు అందులోనే జారిపోయింది. బోట్ అదే ప్రదేశంలో ఉన్నట్లు నిర్ధారించేలా మునిగిపోయిన బోటుకు సంబంధించి తెల్లటి పెయింట్ పైకి తేలింది.

ప్రస్తుతం లంగరు జారిపోవడంతో వెలికితీత పనులకు తాత్కాలిక అంతరాయం ఏర్పడింది. గజ ఈతగాళ్లు గోదావరి నదీగర్భంలోకి వెళ్లి లంగరును బోటుకు తగిలించే విషయమై ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఈతగాళ్లు అంగీకరిస్తే ఈ పద్ధతిలో, లేకపోతే ప్రస్తుతం అనుసరిస్తున్న విధానంలోనే వెలికితీత కార్యక్రమాలు కొనసాగిస్తామని ధర్మాడి సత్యం గ్రూప్ స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్ లో అత్యంత విషాదాన్ని నింపిన బోటు మునక ప్రమాదం సెప్టెంబర్ 15న చోటుచేసుకుంది. ఈఘటనలో ఇంకా 15 మంది పర్యాటకుల ఆచూకీ లభించాల్సి ఉంది.