Union Budget 2022: ప్రైవేటీకరణ అవుతున్న విశాఖ ప్లాంటుకు బడ్జెట్‌లో రూ.910 కోట్లు, పోలవరం, దుగరాజపట్నం పోర్టు ఊసే లేదు, ఏపీ రాష్ట్రానికి బడ్జెట్లో మొండి చేయి చూపిన కేంద్రం

వెనకబడిన జిల్లాలకు నిధులు, దుగరాజపట్నం పోర్టు తదితర హామీలకు నిధులు కేటాయించలేదు.

FM Nirmala Sitharaman

Amaravati, Feb 2: విభజన హామీల ప్రస్తావన లేకపోయినప్పటికీ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (విశాఖ ఉక్కు )కు (Visakhapatnam Steel plant) కేంద్రం బడ్జెట్‌లో రూ.910 కోట్లు కేటాయించింది. వెనకబడిన జిల్లాలకు నిధులు, దుగరాజపట్నం పోర్టు తదితర హామీలకు నిధులు కేటాయించలేదు. విశాఖలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం, ఎనర్జీ యూనివర్సిటీకి రూ.150 కోట్లు, వైజాగ్‌ పోర్టు ట్రస్టుకు రూ.207 కోట్లు కేటాయించారు.

కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా గత బడ్జెట్‌తో (Union Budget 2021) పోలిస్తే పెరిగింది. గత బడ్జెట్‌లో రూ.30,356.31 కోట్లు వస్తే.. ఈ సారి రూ.33,049.80 (4.047 శాతం) కోట్లు రానుంది. దీంట్లో కార్పొరేషన్‌ పన్ను రూ.10,319.40 కోట్లు, ఆదాయపు పన్ను రూ.9,966.37 కోట్లు, సంపద పన్ను రూ. 0.37 కోట్లు, సెంట్రల్‌ జీఎస్టీ రూ.10,851.95 కోట్లు, కస్టమ్స్‌ రూ.1,432.93 కోట్లు, ఎక్సైజ్‌ డ్యూటీ రూ.446.34 కోట్లు, సర్వీస్‌ ట్యాక్స్‌ రూ.33.18 కోట్లు వచ్చాయి.కేంద్ర బడ్జెట్‌లో విశాఖపట్నం రైల్వే జోన్‌ అంశాన్ని కనీసం ప్రస్తావించలేదు. వాస్తవానికి 2019 ఫిబ్రవరి 27న విశాఖ కేంద్రంగా ‘దక్షిణ కోస్తా రైల్వేజోన్‌’ ఏర్పాటు చేస్తున్నామని కేంద్రం ప్రకటించింది. రైల్వే శాఖ ఇందుకు సంబంధించిన డీపీఆర్‌ను సిద్ధం చేసింది. భవనాలు, ఇతర అవసరాల కోసం విశాఖలో (Visakhapatnam) దాదాపు 950 ఎకరాలు అందుబాటులో ఉందని పేర్కొంది.

బీజేపీని బంగాళాఖాతంలో కలిపేస్తాం, ఆయన బట్టలు మారిస్తే దేశం బాగుపడుతుందా, దేశానికి కొత్త రాజ్యాంగం కావాలి, కేంద్ర బడ్జెట్ 2022పై మండిపడిన తెలంగాణ సీఎం కేసీఆర్

కానీ గత రెండు బడ్జెట్‌లలోనూ రైల్వే జోన్‌పై కేంద్రం మొండిచేయి చూపించింది. గత బడ్జెట్‌లో కేవలం రూ.40 లక్షలు కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఏడాదీ నిరాశే ఎదురైంది. ఒడిశాలోని భువనేశ్వర్‌ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే ప్రయోజనాలకు పెద్దపీట వేసింది. రైల్వే శాఖ ద్వంద్వ వైఖరి రైల్వే జోన్‌ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది. కొత్త రైల్వే జోన్‌లు ఏర్పాటు చేసే ఉద్దేశంలేదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ కొన్ని నెలల క్రితం ప్రకటించారు. దీనిపై రాష్ట్రంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దాంతో రైల్వే శాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రకటించినందున విశాఖపట్నం రైల్వే జోన్‌ ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతుందని చెప్పడం రాష్ట్రానికి కాస్త ఊరట నిచ్చింది. అయినప్పటికి మరోసారి మోసపూరిత వైఖరే అవలంబించింది.

 త్వరలో కృష్ణ గోదావరి, కృష్ణ పెన్నా, పెన్నా-కావేరి నదుల అనుసంధానం, భారత్‌లో సొంత డిజిటల్ కరెన్సీ, నిర్మల బడ్జెట్ 2022 ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవే..

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దిక్సూచిలా నిలిచే పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం బడ్జెట్‌లో ప్రత్యేకంగా ఎలాంటి నిధులు కేటాయించలేదు. ఈ ప్రాజెక్టులో 41.15 కాంటూర్‌ వరకూ వచ్చే ఏడాది నీటిని నిల్వ చేయాలంటే నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి, భూసేకరణ చేయడానికి రూ.3,197.06 కోట్లు, జలాశయం.. కుడి, ఎడమ కాలువల్లో మిగిలిన పనులు పూర్తి చేయడానికి తక్షణం రూ.4 వేల కోట్లు వెరసి.. 2022–23 బడ్జెట్‌లో (Union Budget 2022) కనీసం రూ.ఏడు వేల కోట్లను విడుదల చేయాలని అనేక సందర్భాల్లో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

ఆ తర్వాత 45.72 మీటర్లలో నీరు నిల్వ చేయడానికి వీలుగా నిర్వాసితులకు పునరావాసం, భూసేకరణ చేయడానికి రూ.26 వేల కోట్లు విడుదల చేయాలని కోరింది. అయినా ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు. కేంద్ర జల్‌ శక్తి శాఖకు బడ్జెట్‌లో కేటాయించిన రూ.18,967.88 కోట్లలో భారీ నీటి పారుదలకు రూ.1,400 కోట్లు.. భారీ, మధ్యతరహా నీటి పారుదలకు రూ.6,922.81 కోట్లు వెరసి రూ.8,322.81 కోట్లు కేటాయించింది. ఇందులో నుంచే పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు విడుదల చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. నాబార్డు నుంచి రుణం తీసుకుని.. పోలవరానికి నిధులు విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

దేశంలో 60 లక్షల ఉద్యోగాలు, 30 లక్షల కోట్ల రూపాయల అదనపు ఉత్పత్తి, ప్రభుత్వ తదుపరి లక్ష్యమని తెలిపిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్

ఏఐబీపీ (సత్వర సాగునీటి ప్రయోజన పథకం), కాడ్వామ్‌ (కమాండ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అండ్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌), నేషనల్‌ హైడ్రాలజీ ప్రాజెక్టు (ఎన్‌హెచ్‌పీ) తదితర పథకాలను కేంద్ర జల్‌ శక్తి శాఖ ద్వారా అమలు చేస్తోంది. ఏఐబీపీకి బడ్జెట్‌లో రూ.3,239 కోట్లు, కాడ్వామ్‌కు రూ.1,044 కోట్లు, ఎన్‌హెచ్‌పీకి రూ.800 కోట్లను కేటాయించింది. ఈ మూడు పథకాల ద్వారా రాష్ట్రానికి రూ.250 నుంచి రూ.300 కోట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా.

కేంద్ర బడ్జెట్లో రాష్ట్రంలోని జాతీయ విద్యా సంస్థలు, ఇతర సంస్థలకు రిక్తహస్తం చూపింది. మొక్కుబడిగా పెట్రోలియం, సెంట్రల్‌ వర్సిటీ, గిరిజన వర్సిటీలకు కొద్ది మొత్తం నిధులు విదిల్చింది. తక్కిన ఏ సంస్థకూ ఎలాంటి కేటాయింపులూ చేయలేదు. కనీసం గతంలో లక్షో, రెండు లక్షలో కేటాయింపులు చూపేది. ఈసారి బడ్జెట్లో ఆయా సంస్థల పేర్లు కూడా ప్రస్తావించ లేదు.రాష్ట్ర విభజన చట్టం కింద ఏపీలో 7 జాతీయ విద్యా సంస్థలతో పాటు మరో 9 సంస్థలను మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

ఈ ఆర్థిక సంవత్సరంలో సెంట్రల్‌ వర్సిటీకి రూ.56.56 కోట్లు కేటాయించినట్లు చూపించారు. 2020–21లో కేవలం రూ.4.8 కోట్లు మాత్రమే ఇచ్చారు. 2021–22లో రూ.60.35 కోట్లు ఇస్తున్నట్లు బడ్జెట్లో కేటాయింపులు చూపినా, విడుదల చేసింది మాత్రం రూ.20.11 కోట్లు మాత్రమే. ఏపీ, తెలంగాణలకు కలిపి గిరిజన వర్సిటీల ఏర్పాటుకు రూ.44 కోట్లు బడ్జెట్‌ కేటాయింపుల్లో చూపించారు. ఏపీకి ఇందులో రూ.22 కోట్లు కేటాయించారు. 2020–21లో గిరిజన వర్సిటీకి కేటాయించింది కేవలం రూ.89 లక్షలు మాత్రమే. 2021–22లో రూ.26.9 కోట్లు కేటాయింపులు చూపి, కేవలం రూ.6.68 కోట్లు మాత్రమే విడుదల చేశారు.

పేపర్‌ పాస్‌పోర్టుల స్థానంలో కొత్తగా డిజిటల్‌ పాస్‌పోర్టులు, పథకం అమల్లోకి వస్తే చిప్‌ ఆధారిత పాస్‌పోర్టు జారీ

బడ్జెట్‌లో సెంట్రల్‌ వర్సిటీ, గిరిజన వర్సిటీ తప్ప ఇతర విద్యా సంస్థలు, విద్యేతర సంస్థలకు సంబంధించిన ప్రస్తావనే లేదు. విభజన చట్టం కింద రాష్ట్రంలో సెంట్రల్‌ వర్సిటీ అనంతపురంలో ఏర్పాటు కాగా, గిరిజన వర్సిటీ విజయనగరం జిల్లా సాలూరులో ఇంకా ఏర్పాటు కావలసి ఉంది. తిరుపతిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చి (ఐఐఎస్‌ఈఆర్‌), విశాఖపట్నంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం), తాడేపల్లి గూడెంలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ), కర్నూలులో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ డిజైన్‌ (ఐఐఐటీడీ), గుంటూరులో అగ్రికల్చర్‌ యూనివర్సిటీలు ఉన్నాయి.

మంగళగిరిలో ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌), విజయవాడలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంటు, విశాఖపట్నంలో పెట్రోలియం అండ్‌ ఎనర్జీ యూనివర్సిటీ, సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెన్‌ ట్రేడ్, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకేజింగ్, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ రిఫైనరీ తదితర సంస్థల గురించి కనీస ప్రస్తావన కూడా కేంద్ర బడ్జెట్లో లేదు.