CM KCR Fire (photo-Twitter)

Hyd, Feb 2: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR) తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇది దారుణమైన బడ్జెట్‌, అది పసలేని, పనికిమాలిన బడ్జెట్‌ అని, ఏ వర్గానికీ మేలు చేయని బడ్జెట్‌ అని అన్నారు. మంగళవారం ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరు ల సమావేశంలో కేసీఆర్‌ కేంద్ర బడ్జెట్‌పై (BJP, Union Budget 2022-23) మాట్లాడారు. దూరదృష్టి లేని కురచ ప్రభుత్వం కేంద్రంలో(Center) అధికారంలో ఉండటం దరిద్రం. బడ్జెట్‌లో రైతులు, పంటలకు కనీస గిట్టుబాటు ధర ప్రస్తావనే లేదు. పైగా రూ.12,708 కోట్ల యూరియా సబ్సిడీ, రూ.22192 కోట్ల ఇతర ఎరువుల సబ్సిడీలు కలిపి మొత్తం రూ.34,900 కోట్ల సబ్సిడీలను తగ్గించారు.

2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామనే హామీ ఏమైంది? రైతుల పరిస్థితే బాగుంటే ఏడాది పాటు ఎండావానల్లో ఆందోళన ఎందుకు చేశారు? ఓ వైపు దేశంలో నిరుద్యోగం తీవ్రంగా పెరిగిపోతే, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.25 వేల కో ట్లు కోత పెట్టారు. కేంద్ర విద్యుత్‌ విధానం మెం టల్‌ కేస్‌లాగా ఉంది..’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు (CM KCR) ఆగ్రహం వ్యక్తం చేశారు. డొల్ల ప్రచారం, గోల్‌మాల్‌ గోవిందం తప్ప అందులో ఏమీ లేదని, బడ్జెట్‌ అంతా గుండు సున్నా అని ఆరోపించారు.

రైతులను, నేతన్నలను ఆదుకునేందుకు ఎటువంటి చర్యలూ తీసుకోలేదని, దళితులను చిన్నచూపు చూసిందని, ఉద్యోగ వర్గాలు, పన్ను చెల్లింపుదారుల ఆశలపై నీళ్లు చల్లిందని, కరోనా కష్టకాలంలో వైద్యరంగంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకోవాలనే సోయి కూడా లేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో మెదడులేని, తెలివితక్కువ ప్రభుత్వం ఉండటం వల్లే ఈ పరిస్థితి దాపురించిందన్నారు. యువత మేల్కొనాలని, పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకుంటున్న బీజేపీపై తాము పోరాడతామని, ఆ పార్టీని బంగాళాఖాతంలో కలుపుతామని ప్రకటించారు. ప్రస్తుత రాజ్యాంగంతో ప్రజలు ఆశించిన విధంగా పాలనసాగడం లేదని, దేశానికి కొత్త రాజ్యాంగం అవసరం ఉందని అన్నారు.

తెలుగు రాష్ట్రాలకు శుభవార్త, త్వరలో కృష్ణ గోదావరి, కృష్ణ పెన్నా, పెన్నా-కావేరి నదుల అనుసంధానం, భారత్‌లో సొంత డిజిటల్ కరెన్సీ, నిర్మల బడ్జెట్ 2022 ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవే..

దురదృష్టకరం ఏమంటే మహాభారతంలోని శాంతిపర్వం శ్లోకాన్ని ఆర్థికమంత్రి ప్రస్తావించడం. రాజ్యాన్ని రాజు ఎలా నడపాలన్న విషయంపై భీష్మాచార్యుల వారు చేసిన ధర్మ సందేశం అది. రాజులు రాజ్యాన్ని న్యాయం, ధర్మ మార్గంలో పాలించాలన్నది శ్లోకంలోని అర్థం. పాలకులకు స్ఫూర్తిగా నిలిచిన ధర్మ మార్గం శ్లోకాన్ని ప్రస్తావిస్తూ ఆర్థికమంత్రి పార్లమెంటు సాక్షిగా అధర్మంగా ప్రవర్తించారు. ఆమె తనకు తాను ఆత్మవంచన చేసుకుంటూ.. దేశ ప్రజలనూ చాలా ఘోరంగా, దారుణంగా వంచించారు. బడ్జెట్లో గుండు సున్నా, కల్ల డొల్ల ప్రచారం.. గోల్‌మాల్‌ గోవిందం తప్ప.. ఎవరికీ ఏమీ లేదు. పేద ప్రజలకు దక్కింది గుండుసున్నా’’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్ర బడ్జెట్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వచ్చే 25 ఏళ్లు భారత్‌‌ను అగ్రదేశంగా నిలబెట్టే బడ్జెట్ ఇది, కరోనా సంక్షోభ సమయంలోనూ బడ్జెట్‌ ప్రవేశ పెడుతున్నాం, లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

దేశంలో దాదాపు 40 కోట్లుగా ఉన్న ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన బడ్జెట్‌ కేవలం రూ.12,800 కోట్లు. చిన్న రాష్ట్రమైనా తెలంగాణలో ఎస్సీ, ఎస్టీలకు సబ్‌ప్లాన్‌ కింద మా ప్రభుత్వమే రూ.33,611 కోట్లు ఖర్చు చేస్తోంది. దళితుల పట్ల కేంద్ర ప్రభుత్వం దృక్పథం ఏమిటో ఈ కేటాయింపులు తెలుపుతున్నాయి. దళితుల పట్ల చిన్నచూపునకు ఉదాహరణ ఇది. ఇంతకన్నా సిగ్గు, షరం. దౌర్భాగ్యం ఉండదు. ఏడాదిపాటు సాగిన ఉద్యమంలో 750 మంది రైతులు ప్రాణాలు కోల్పోతే జరిగిన తప్పిదాన్ని నాలుక్కరచుకుని దేశ ప్రజలకు ప్రధాని క్షమాపణ చెప్పినా.. బడ్జెట్‌లో మాత్రం అసలు వారి ప్రస్తావనే లేదు. ఎలాంటి ఉద్దీపనలు ఇవ్వకపోగా రూ.34,900 కోట్లుగా ఉన్న యూరియా సబ్సిడీని రూ.22,192 కోట్లకు తగ్గించారు. యూరియా సబ్సిడీ రూ.12,708 కోట్లు తగ్గించడం రైతులకు మోదీ ప్రభుత్వం ఇచ్చిన బహుమతి. కరోనాతో దేశంలో నిరుద్యోగం పెరిగింది. అనేకమంది ఉపాధి కోల్పోయి దయనీయమైన స్థితిలో ఉంటే.. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించే ఉపాధిహామీ పథకానికీ కేటాయింపులు రూ.93 వేల కోట్ల నుంచి రూ.73 వేల కోట్లకు తగ్గించారు. ఆహార సబ్సిడీలను రూ.2.11 లక్షల కోట్ల నుంచి రూ.1.40 లక్షల కోట్లకు తగ్గించారని మండిపడ్డారు.

పేపర్‌ పాస్‌పోర్టుల స్థానంలో కొత్తగా డిజిటల్‌ పాస్‌పోర్టులు, పథకం అమల్లోకి వస్తే చిప్‌ ఆధారిత పాస్‌పోర్టు జారీ

కాంగ్రెస్‌ విఫలమైతే మోదీ వచ్చిండు. గుజరాత్‌లో ఏదో పొడిచినట్టు.. సోషల్‌ మీడియాలో దొంగ ప్రచారంతో పూర్తి అధర్మం.. పచ్చి అబద్ధాలు చెప్పారు. ఒకే అబద్ధాన్ని వెయ్యిసార్లు చెప్పే, ఇతరులను కించపరిచే దిక్కుమాలిన సోషల్‌ మీడియా దొంగ ప్రచారాన్ని ప్రజలు నమ్మి ఓటువేసిండ్రు. పైన పటారం లోన లొటారం. ఇప్పుడు బండారం బయటపడింది. కరోనా కాలంలో గంగానదిలో శవాలు తేలాయి. వైద్యం అందక వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. కానీ, కేంద్రం ఆరోగ్యం రంగంపై ఒక్క పైసా పెంచకపోగా ఇంకా తగ్గించి శ్లోకాలు వల్లిస్తున్నారు. బ్యాంకులను మోసగించిన వారికి వేల కోట్లు సబ్సిడీలు ఇస్తరు. బీజేపీ పాలన అంటే దేశాన్ని అమ్ముడు, మతపిచ్చి లేపుడు.. మంది మీద పడి ఏడ్చుడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశంలో 60 లక్షల ఉద్యోగాలు, 30 లక్షల కోట్ల రూపాయల అదనపు ఉత్పత్తి, ప్రభుత్వ తదుపరి లక్ష్యమని తెలిపిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్

వరల్డ్‌ హంగర్‌ ఇండెక్స్‌లో మనదేశం నేపాల్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ కంటే అధ్వాన్నంగా ఉంది. మొత్తం 116 దేశాలకు ర్యాంకులు ఇస్తే మనం 101వ స్థానంలో ఉన్నాం. ఇది మోదీ ప్రభుత్వం సాధించిన ఘనత. అద్భుతమైన ఎల్‌ఐసీని అమ్మేస్తామని బడ్జెట్‌ ప్రసంగంలోనే చెప్పారు. లాభాల్లో ఉన్న ఎల్‌ఐసీని ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నిస్తున్నాం. కేంద్రప్రభుత్వం అమెరికా బీమా కంపెనీలకు బ్రోకర్‌గా వ్యవహరిస్తోంది. 2022 వరకు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి ధరలు పెంచి రైతుల పెట్టుబడులు రెట్టింపు చేశారు. మీరు మంచి చేస్తే రైతులు ఏడాది వరకు ఆందోళన ఎందుకు చేస్తరు? ఇంటికి రూ.15 లక్షలు అన్నరు, నల్లధనం తెస్తామన్నరు. తెచ్చారా? గజదొంగలు, బ్యాంకు దోపిడీగాళ్లను మీ హయాంలోనే విదేశాలకు పంపారు. దేశంలో 15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే తెలంగాణలో ధర్నా చేస్తామంటూ మంది మీద పడి ఏడుస్తున్నరాన్నారు.

ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ తరలిస్తున్నారు.. ఐటీ సంస్థలు, పెట్టుబడిదారుల మధ్య గొడవలు పరిష్కరించుకునేందుకు విదేశాల్లోని ఆర్బిట్రేషన్‌ సెంటర్లకు వెళ్లాల్సి వస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ సహకారంతో హైదరాబాద్‌లో ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ను అద్దె భవనంలో ఏర్పాటు చేశాం. దీనికి ప్రభుత్వం తరఫున రూ.300 కోట్లు విలువ చేసే స్థలం, భవనం నిర్మాణానికి రూ.50 కోట్లు ఇవ్వాలని నిర్ణయించాం. ప్రధాని మోదీ కురుస బుద్ధి చూపిస్తూ.. హైదరాబాద్‌లో ఎందుకు? అహ్మదాబాద్‌లో పెట్టాలంటున్నారు. బడ్జెట్లో కూడా గిఫ్ట్‌ సిటీలో ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించారు. హైదరాబాద్‌లో ఇప్పటికే ప్రారంభించిన దానికి రూ.100 కోట్లు ప్రతిపాదించి, అహ్మదాబాద్‌లో మరొకటి పెడతామని చెప్పాల్సి ఉండేది. దేశంలో క్రిప్టో కరెన్సీని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందా? బుర్ర లేకుండా ఈ కరెన్సీ వాడకంపై 30 శాతం వసూలు చేస్తామని పేర్కొనడం వారి తెలివితక్కువతనానికి నిదర్శనమన్నారు.

పెరిగే వస్తువుల ధరలు, అలాగే తగ్గే వస్తువుల ధరలు ఇవే, దాదాపు గంటన్నరకు పైగా సాగిన ఆర్థికమంత్రి బడ్జెట్‌ ప్రసంగం

గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేస్తామని ఏ అధికారంతో చెప్తారు? ట్రైబ్యునల్‌ తీర్పు ప్రకారం.. తెలంగాణ, ఏపీలో ప్రవేశించే గోదావరి నది ప్రతి నీటి చుక్కపై హక్కు ఉందని బచావత్‌ ట్రైబ్యునల్‌ పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పునకు సమానమైన ఈ నిర్ణయాన్ని కాదని ఏ చట్టం ప్రకారం ఈ నదుల నీళ్లను కలుపుతారు? దేశంలో 65 వేల టీఎంసీల నీళ్లున్నాయి.. వాటిని వినియోగించడంలో కాంగ్రెస్‌, బీజేపీలు విఫలమయ్యాయి. కేంద్రం వాటర్‌ పాలసీనే సరైంది కాదు.. జల్‌శక్తి మిషన్‌ అంట.. వాని బొంద మిషన్‌. ఇంటింటికీ తాగునీళ్లందించేందుకు దేశం మొత్తానికి రూ.60 వేల కోట్లంట.. తెలంగాణలో 4 కోట్ల జనాభాకు మిషన్‌ భగీరథ పెడితే 40 వేల కోట్లు ఖర్చు చేశాం. వాళ్లిచ్చే రూ.60 వేల కోట్లు దేశం మొత్తానికి ఏం సరిపోతాయని ఎద్దేవా చేశారు.

మన దేశంలో భారీగా వనరులున్నప్పటికీ అభివృద్ధి కాలేదంటే దిమాక్‌ ఉన్న నాయకుల్లేకపోవడమే. దీనిపై యువత పోరాటం చేయాలి. ఎన్నికలు జరగబోయే ఐదు రాష్ట్రాల్లో ఫలితాలు సెమీఫైనల్‌ కాదు. ఉత్త్తరప్రదేశ్‌లో ఎవరైనా గెలవచ్చు. 2024 సాధారణ పోరు పతనానికి యూపీ ఫలితాలు పునాది అవుతాయి. నాది దేశ పరివర్తన కోసం చేసే పోరు. ప్రధాని పదవి కోసం పోరాటం కాదు. 75 ఏండ్ల తర్వాత కూడా దేశ బడ్జెట్‌ రూ.40 లక్షల కోట్లు దాటదా? సిగ్గుచేటు దేశానికే. రామానుజుల విగ్రహం మోదీ కట్టించారా? ఇంతకన్నా లత్కోర్‌ దందా ఇంకోటి ఉంటుందా సోషల్‌ మీడియాకు? చినజీయరు స్వామి హైదరాబాద్‌ సమీపంలో రామానుజుల వారి విగ్రహం పెట్టారు. తమిళనాడులో పెట్టాల్సింది. మైహోమ్‌ రామేశ్వర్‌రావు 70 ఎకరాల భూమి ఇవ్వడంతో స్వామీజీ మఠం ఏర్పాటు చేసుకుని.. సొంతంగా డబ్బులు పోగేసుకుని సమతామూర్తి పేరిట ఏర్పాటు చేసిన రామానుజ విగ్రహాన్ని కూడా బీజేపీ, వాళ్ల సంస్థలు ప్రచారానికి ఉపయోగించుకోవడం బాధాకరం.

దీనికి బీజేపీ ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. హైదరాబాద్‌లో కట్టిన ఫొటో తీసుకెళ్లి ఉత్తరప్రదేశ్‌లో ప్రచారానికి వాడుకున్నారు. కేంద్ర అభివృద్ధిపై ఏ టీవీ చర్చలో కూర్చుందాం? ఏ టీవీలోనో... ఏ జర్నలిస్టు వేదికలోనో చర్చ చేద్దాం? సిగ్గులేకుండా అబద్ధాలు ప్రచారం చేసుడు... క్షుద్ర విద్యతో దుష్ప్రచారం చేయడమేంటి? స్వాతి చతుర్వేది అనే ఇంగ్లిష్‌ జర్నలిస్టు రాసిన ‘‘ఐయామ్‌ ఏ ట్రోల్‌’’ బుక్‌లో బీజేపీ అరాచకాలను రాసింది అందరూ చూడాలె. దేశంలో ప్రతి పార్టీ నేతతో భేటీ అవుతా. ఒవైసీ దేశంలోని ముస్లిం వర్గానికి తనను ముఖంగా చూసుకోవాలని అనుకుంటున్నారు. ఆయన తెలంగాణ బిడ్డనే. మల్టీ జోనల్‌ పోస్టింగ్‌లతో 95 శాతం తెలంగాణ ఉద్యోగులకు వస్తాయి. బీజేపీగాళ్లు సిగ్గు తప్పి, తెలివి తక్కువగా 317 జీవోపై దుష్పప్రచారం చేస్తున్నారు. ఇక ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం మాకు లేదు. కొందరు ముందస్తుకు వెళ్తున్నారని ప్రచారం చేస్తున్నారు. మాకేమైనా పిచ్చికుక్క కరిచిందా? ఎందుకు ముందస్తుకు వెళ్తాం? రాష్ట్రంలో షెడ్యూల్‌ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరగుతాయి. ఆరునెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు.

దేశానికి కొత్త రాజ్యాంగం కావాలి. చాలా దేశాలు మార్పులకు అనుగుణంగా వాటి రాజ్యాంగాలను సవరించుకున్నాయి. కొత్త రాజ్యాంగంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. ప్రస్తుత రాజ్యాంగాన్ని సవరిస్తే ఉపయోగం లేదు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా.. ప్రజలు ఆశించినట్లు పాలన జరగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త రాజ్యాంగం కావాలి. 80 సార్లకు పైగా రాజ్యాంగాన్ని ఎందుకు సవరించారో సమాధానం చెప్పాలి. 50 ఏళ్ల ప్రజా జీవితంలో నాకు భారత రాజ్యాంగం అనేక అవకాశాలు కల్పించింది. 50 ఏళ్ల అనుభవంతో చెప్తున్నా. దేశానికి కొత్త రాజ్యాంగం కావాల్సిందేనని మండి పడ్డారు.

మరో 25 ఏళ్లు ఈ సన్నాసులు అధికారంలో ఉంటారా? నేనూ 100 ఏళ్లు ఉంటానని చెప్తా. ఉంటానా? ఇక్కడ చంద్రబాబు చెప్పలేదా? నేనే 25 ఏళ్లు అధికారంలో ఉంటానని అన్నారు. ఉన్నారా? రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు బలమైన ప్రత్యర్థి లేదు. కాంగ్రెస్‌, బీజేపీ మాకు పోటీనే కాదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 107 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. బీజేపీ సోషల్‌ మీడియాలోనే హడావుడి చేస్తోంది. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం మా పాలసీ. ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 5న హైదరాబాద్‌కు వస్తే ప్రొటోకాల్‌ ప్రకారం స్వాగతం పలుకుతా. దేశంలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తానని నేను ఎక్కడా చెప్పలేదు. కొన్ని బాధల నుంచి విముక్తి కావాలి. తెలంగాణలో విలీనమవుతామని మహారాష్ట్రలోని కొన్ని గ్రామాలు తీర్మానాలు చేశాయి. కర్ణాటకలోని రాయచూర్‌ ఎమ్మెల్యే కూడా విలీన ప్రతిపాదనను ప్రభుత్వానికి చేశారు. భవిష్యత్‌లో దేశానికి మోడల్‌గా తెలంగాణ నిలుస్తుంది. పీఎం గతిశక్తి యోజన ద్వారా లక్ష కోట్ల రుణాలు ఇస్తామనడం విడ్డూరంగా ఉంది. రుణాలు 100 లక్షల కోట్లు ఇవ్వొచ్చు. అది గ్రాంటు కాదు. రుణాలతో ఎలాంటి ఉపయోగం ఉండదు. సీనియర్‌ ఐఏఎస్‌ రజత్‌కుమార్‌ ఆరోపణల వ్యవహారం నా దృష్టికి రాలేదు. ఎందరో ఆరోపణలు చేస్తారు. అన్నింటినీ పట్టించుకోం’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

140 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహించే ప్రధాని నీళ్లలో విమానం దిగి ఏదో పీకి పడేసిన అని చెప్తుండు. బెంగాల్‌లో ఎన్నికలొస్తే ఠాగూర్‌లా వేషం, తమిళనాడు ఎన్నికలొస్తే లుంగీ కట్టడం వంటి బట్టలు మార్చే ట్రిక్కులతో దేశం బాగుపడుతుందా? రాజ్యాంగం కేంద్రం, రాష్ట్రాలకు విడిగా, ఉమ్మడిగా అధికారాలు ఇచ్చినా.. కాంగ్రెస్, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాలు లాక్కున్నాయి. వన్‌ నేషన్‌ వన్‌ రిజిస్ట్రేషన్‌ వంటి ప్రతిపాదనలతో రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోంది. రాష్ట్రానికి వచ్చే ప్రధానికి ఒక ముఖ్యమంత్రిగా స్వాగతం పలుకుతా. కానీ నా అభిప్రాయాలను హెలికాప్టర్‌లో కూర్చుని ప్రధానితో కూడా చెప్పగలను. నేను కేసీఆర్‌ను.. వెనక్కి తగ్గే రకం కాదు.కేసీఆర్‌ను జైల్లో వేస్తామనే చిల్లరగాళ్లు అనేక రకాలుగా ఉంటారు. సోషల్‌ మీడియా పేరిట సొల్లు పురాణం కుమ్మరిస్తే ఇకపై చూస్తూ ఊరుకోం. విరిచి పోయిలో పెడతామని హెచ్చరించారు.