FM Nirmala Sitharaman

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వరుసగా నాలుగోసారి కేంద్ర బడ్జెట్ ను.. ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్.. పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. అంతకుముందు.. కేంద్ర కేబినెట్ ప్రత్యేకంగా సమావేశమై.. పద్దులను ఆమోదించింది. మోదీ ప్రభుత్వంలో 10వ బడ్జెట్ గా.. వరుసగా రెండో సారి పేపర్ లెస్ బడ్జెట్ గా.. కోవిడ్ పరిస్థితుల్లో మూడో బడ్జెట్ గా.. కేంద్ర పద్దులను మంత్రి నిర్మల సభ ముందుకు తీసుకువచ్చారు. నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్​ 2022-23 పై తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు.

వచ్చే 25 ఏళ్ల అమృతకాలానికి ఈ బడ్జెట్‌ పునాదిపారదర్శకమైన సమీకృత అభివృద్ధికి ఈ బడ్జెట్‌ నాంది కానుందని బడ్జెట్ పద్దును ప్రవేశ పెడుతూ నిర్మలమ్మ అన్నారు. డీబీటీ ద్వారా పేదలకు నేరుగా ఆర్థికసాయం లభిస్తుందన్నారు. గృహనిర్మాణం, వసతుల కల్పన, తాగునీరు కల్పనలో దేశం వేగంగా ముందుకెళ్తోందన్నారు. ఆజాదీ కా అమృతోత్సవ్‌ పరుగు ప్రారంభమైందన్నారు. వచ్చే 25 ఏళ్లు భారత్‌ను అగ్రదేశంగా నిలబెట్టేందుకు ప్రణాళికలు రెడీ చేసినట్లుగా చెప్పారు. కొవిడ్‌ కట్టడిలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం బాగా కలిసొచ్చిందన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడటంలో టీకా కీలకపాత్ర పోషించిందని వెల్లడించారు. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోంది. పేద మధ్యతరగతి సాధికారితకు ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి అన్నారు.

బడ్జెట్‌కు ముందే భారీగా తగ్గిన సిలిండర్ ధర, వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.91.50 వరకు తగ్గింపు, తగ్గని గృహ వినియోగ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌ ధర

కరోనా సంక్షోభ సమయంలోనూ బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నామని, మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు యత్నిస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. ఇక ఈ బడ్జెట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అందరి ప్రయోజనాలను కాపాడే లక్ష్యంగా బడ్జెట్ ఉందన్నారు. ఆర్థిక మంత్రి ప్రసంగం కొనసాగుతోంది.