Vivekananda Reddy Murder Case: వివేకా హత్య కేసులో ట్విస్ట్, ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ మళ్లీ వాయిదా, ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరిన సీబీఐ
అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనలు కొనసాగుతుండడంతో రేపు(బుధవారం) ఆయన్ని విచారించాలని సీబీఐ నిర్ణయించుకుంది.
Hyd, April 18: వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి విచారణను సీబీఐ మళ్లీ వాయిదా వేసింది. అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనలు కొనసాగుతుండడంతో రేపు(బుధవారం) ఆయన్ని విచారించాలని సీబీఐ నిర్ణయించుకుంది. ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌లోని కోఠి సీబీఐ కార్యాలయంలో అవినాష్‌రెడ్డి విచారణ జరగాల్సి ఉంది. అయితే.. హైకోర్టులో విచారణ పూర్తికాలేదన్న విషయం కోర్టు దృష్టికి వెళ్లింది. ఈ తరుణంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సైతం కోర్టులోనే ఉండడంతో.. ఎవరు ప్రశ్నిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో విచారణను రేపు ఉదయానికి వాయిదా వేస్తున్నట్లు దర్యాప్తు సంస్థ, కోర్టుకు తెలియజేసింది.
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. అవినాష్ నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని.. ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరారు.
వివేకా హత్యకేసులో విచారణకు రావాలంటూ సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఎంపీ అవినాష్‌రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. పిటిషన్ తేలే వరకు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆయన కోరారు. వివేకా హత్యతో నాకు ఎలాంటి సంబంధం లేదు. దస్తగిరి వాంగ్మూలం మేరకు నన్ను ఇరికించాలని సీబీఐ చూస్తోంది. నిందితుడిగా చేర్చి అరెస్టు చేసే ఉద్దేశంలో సీబీఐ ఉంది.
కొత్తగా గూగుల్ టేకవుట్ డేటాను తెరపైకి తెచ్చింది. ఒక వ్యక్తి ఎక్కడున్నారో గూగుల్ టేకవుట్ డేటా చెప్పలేదు. నాలుగేళ్లలో అనేక పరిణామాల తర్వాత నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. నన్ను అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి.. ఒక వేళ అరెస్టు చేస్తే బెయిల్‌పై విడుదల చేసేలా సీబీఐని ఆదేశించాలి’’ అని బెయిల్ పిటిషన్‌పై అవినాష్‌రెడ్డి అభ్యర్థించారు.
ఇదిలా ఉంటే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో వివేకా హత్య కేసు పరిణామాలపైనా చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తే ఎలా ముందుకెళ్లాలనే అంశంపై సమీక్షలో చర్చ జరిగినట్లు సమాచారం.
వివేకా హత్యకేసులో దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే ముందుకు వెళ్లడం లేదని... దర్యాప్తులో చాలా విషయాలు వెల్లడయ్యాయని తెలంగాణ హైకోర్టుకు సీబీఐ సోమవారం నివేదించింది.సంఘటన స్థలంలో సాక్ష్యాలను చెరిపివేయించడంలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని, ఈ విషయం దర్యాప్తులోనే వెల్లడైందని తెలిపింది. ఈ నెల 30లోగా దర్యాప్తు పూర్తిచేయాలని సుప్రీంకోర్టు గడువు విధించిందని, విచారణకు నోటీసు ఇస్తే అవినాష్‌రెడ్డి కోర్టులను ఆశ్రయించి దర్యాప్తును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపింది. సాక్షిగా నోటీసు ఇచ్చి విచారణకు పిలిచినా... అవసరమైతే అరెస్టు తప్పదని స్పష్టం చేసింది. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లోనే సీఆర్‌పీసీ సెక్షన్ 41 కింద నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది