Andhra pradesh: ఇంత రాక్షసత్వమా..పుట్టిన చిన్నారులను చంపేశారు, విశాఖలో రెండేళ్ల బాబుతో ఆత్మహత్య చేసుకున్న యువతి, పలాసలో కళ్లు తెరవని పసిపాపను పూడ్చిపెట్టిన ఆస్పత్రి వర్గాలు, నెల్లూరులో 16 రోజుల పసికందును వాటర్ ట్యాంకులో పడేసారు
బాబు పుట్టిన రోజుకు సంబంధించి దంపతుల మధ్య కలహాలతో ఓ వివాహిత తన రెండేళ్ల కుమారుడితో సహా అపార్ట్‌మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్యకు (Woman ends life with 2years son ) పాల్పడింది.
Visakhapatanam, Julu 10: బాబు పుట్టిన రోజుకు సంబంధించి దంపతుల మధ్య కలహాలతో ఓ వివాహిత తన రెండేళ్ల కుమారుడితో సహా అపార్ట్‌మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్యకు (Woman ends life with 2years son ) పాల్పడింది. విశాఖపట్నం గాజువాక ఎస్‌ఐ సూర్యప్రకాశరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన సంతోష్ బెహరా విశాఖలోని న్యూ పోర్టులో డెలివరీ విభాగంలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య జయంతి బెహరా(26), కుమారుడు రోనిత్ కుమార్ (2)తో కలిసి చుక్కవానిపాలెంలోని సువర్ణ శ్రీనివాసం అపార్ట్‌మెంట్‌లో రెండేళ్లుగా అద్దెకు నివాసం ఉంటున్నారు.
కాగా రెండు రోజుల్లో వారి కుమారుడు రోనిత్ కుమార్ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవలసి ఉంది. అయితే ఈ వేడుకలపై భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు చోటు చేసుకోవడంతో గొడవలు జరగుతున్నాయని వారి బంధువులు తెలిపారు. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం జయంతి బెహరా తన కుమారుడిని తీసుకొని అపార్ట్‌మెంట్ పైకి వెళ్లి అక్కడ నుంచి దూకేసింది.
దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. కొన ఊపిరితో ఉన్న రోనిత్ కుమార్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. వారు ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో సంతోష్ బెహరా విధుల్లో ఉన్నాడని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో దారుణ ఘటన: ఇక శ్రీకాకుళం జిల్లాలో (Srikakulam) దారుణ ఘటన చోటు చేసుకుంది. అప్పుడే భూమి మీదకు వచ్చి ఇంకా కళ్లు కూడా తెరవని బుజ్జాయిని గుడ్డ ముక్కలతో చుట్టి మట్టిలో పాతి పెట్టారు. దీన్ని ఎవరో వీడియో తీయడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైరల్ అయిన వీడియో.. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం.. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వర్గాలు చనిపోయిన బిడ్డను పాతిపెట్టేయాలని కొందరికి పని అప్పగించారు.
వారు గొయ్యి తవ్వుతుండగా బిడ్డ కదలడం చూసి ఆశ్చర్యపోయారు. . ఏం చేయాలో తెలీని స్థితిలో అలాగే ఉండిపోయారు. ఆ కాసేపు పెనుగులాట తర్వాత బిడ్డ కూడా కదలడం మానేసింది. దీంతో వారు కూడా చేసేదేమీ లేక చనిపోయిందని నిర్ధారించుకుని పూడ్చిపెట్టారు. ఈ విషయం బయటకు తెలియడంతో స్థానికులంతా ఆస్పత్రి తీరుపై మండిపడుతున్నారు.
నెల్లూరు జిల్లాలో (SPSR Nellore) మరో దారుణం చోటు చేసుకుంది. నిండా పదహారు రోజులు కూడా నిండని పసికందును (16 days Baby) వాటర్ ట్యాంకులో పడేసి ఉసురు తీశారు. నెల్లూరు రంగనాయకులపేట గొల్లవీధిలో శుక్రవారం జరిగిన ఈ అమానుష ఘటన స్థానికులను కలచివేసింది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం.. విద్యావతికి 2018లో కొడవలూరు పెయ్యళపాలేనికి చెందిన వెంకటేశ్వర్లుతో వివాహమైంది. వారికి రెండేళ్ల పాప అద్వికత ఉంది. గత నెల 24న విద్యావతి మరో పాపకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి విద్యావతి ఇద్దరు పిల్లలతో కలిసి గొల్లవీధిలోని తల్లి వద్దే ఉంటోంది.
శుక్రవారం చిన్నారికి విద్యావతి స్నానం చేయించి మొదటి అంతస్తులోని ఊయల్లో పడుకోబెట్టి నిద్రపోయింది. కొద్దిసేపటికి మెలకువ వచ్చి ఊయల్లో చూడగా పాప లేదు. ఇల్లంతా వెదికినా కనిపించలేదు. కుటుంబ సభ్యులు, స్థానికులు చుట్టుపక్కల అంతా గాలించినా ఫలితం లేకపోయింది. విద్యావతి నివాసముంటున్న పక్క ఇంట్లోనే ఆమె చిన్నమ్మ జ్యోతి ఉంటోంది. ఆమె ఇంటి మిద్దెపై ఉన్న వాటర్ ట్యాంకులో పాప మృతిచెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించారు.
ఆ చిన్నారి మృతదేహాన్ని చూసిన ఆ తల్లి, అమ్మమ్మలను ఓదార్చడం ఎవరితరం కాలేదు. సంతపేట ఇన్‌స్పెక్టర్ అన్వర్‌బాషా ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. జ్యోతే ఈ దురాగతానికి ఒడిగట్టి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తూ విద్యావతి తల్లి శారద పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.