బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడబోతోంది. దీని ప్రభావంతో రానున్న రెండో రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy rains forecast) కురవనున్నాయి. 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని (Heavy rains forecast for the Telugu States) వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు.
అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని... మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణశాఖ కమిషనర్ కె.కన్నబాబు సూచించారు. కోస్తా, రాయలసీమల్లో శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరువర్షాలు కురుస్తాయని, ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీవర్షాలు పడే సూచనలున్నాయని తెలిపారు. ఈ నెల 17న ఏపీ తీరానికి సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ అధికారులు తెలిపారు.
రుతుపవనాల కారణంగా ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీనికి అల్పపీడనం కూడా తోడు కావడంతో అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ విషయానికి వస్తే, ఈరోజు నల్గొండ, సంగారెడ్డి, వికారాబాద్, నాగర్ కర్నూల్, సూర్యాపేట జిల్లాల్లోను... రేపు జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, పెద్దపల్లి, మంచిర్యాల, ములుగు జిల్లాల్లోనూ కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఏపీలో ఇప్పటికే పలు చోట్ల వానలు పడుతున్నాయి. గత నాలుగైదు రోజులుగా పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. తాజాగా వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు చేసింది. రేపటి నుంచి ఈ నెల 22వ తేదీ వరకు తీరప్రాంతం, రాయలసీమలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. వాయవ్య ప్రాంతంలో ఈ నెల 11న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర, యానాం, రాయలసీమలో భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. ఈ నెల 10న కోస్తా తీరంలో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఇప్పటికే పక్క రాష్ట్రమైన కర్ణాటకను కూడా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. అక్కడైతే ఏకంగా రానున్న వారం రోజుల్లో అతి భారీ వర్ష సూచన ఉందని తెలుపుతూ రెడ్, ఆరెంజ్ అలెర్ట్ లను కూడా ప్రకటించారు. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే మన రాష్ట్రాల్లో రెడ్ అలెర్ట్ కాకపోయినా భారీ వర్షాలు మాత్రం పడే అవకాశం ఉందని అంటున్నారు