IPL Auction 2025 Live

Andhra Pradesh Elections 2024: కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ షర్మిల ? సాధ్యాసాధ్యాలపై పార్టీ నేతలతో సమావేశం, పార్టీ విలీనంపై కీలక ప్రకటన చేసే అవకాశం

తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది.

YS Sharmila (Photo Credit: X/ @realyssharmila)

Hyd, Jan 2: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఈ నెల 4న కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. ఆ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న షర్మిల కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు.

ఈ ఉదయం 11 గంటలకు షర్మిల తన పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌లో పార్టీ విలీనంపై చర్చించనున్నట్టు సమాచారం. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారనే ఊహాగానాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ముఖ్యనేతలతో సమావేశం తర్వాత పార్టీ విలీనంపై ఆమె కీలక ప్రకటన చేసే అవకాశముంది.

త్వరలోనే కాంగ్రెస్‌ లోకి షర్మిల.. తనకు సమాచారం ఉందన్న కేవీపీ.. కాంగ్రెస్‌లోకి వస్తే ఆహ్వానిస్తామన్న కేవీపీ

కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడంపై షర్మిల మాట్లాడుతూ కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. అందుకనే ఆయన మళ్లీ అధికారంలోకి రాకూడదని కోరుకున్నట్టు తెలిపారు. తాను పోటీ చేస్తే 55 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌పై ప్రభావం చూపుతుందని, అదే జరిగితే తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్న ఉద్దేశంతో కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించినట్టు తెలిపారు.

మరోవైపు మధ్యాహ్నం మూడు గంటలకు షర్మిల ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి కడప వెళ్లనున్నారు. అక్కడి నుంచి సాయంత్రం నాలుగు గంటలకు ఇడుపులపాయ చేరుకుని తండ్రి వైఎస్‌ఆర్‌ సమాధి వద్ద నివాళులర్పిస్తారు. కుమారుడు రాజారెడ్డి వివాహం సందర్భంగా తండ్రి ఆశీర్వాదం కోసం ఆమె వెళ్లనున్నారు. నూతన వధూవరులు రాజారెడ్డి, ప్రియతో కలిసి షర్మిల ఇడుపులపాయకు చేరుకుంటారు.