YSR Village Health Clinics: వైద్య రంగంలో సరికొత్త విప్లవం, డిసెంబర్ నుంచి అందుబాటులోకి రానున్న వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్, ప్రతి 2,500 జనాభాకు ఒక వైఎస్సార్ విలేజ్ క్లినిక్ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు
వైద్య ఆరోగ్య రంగాన్నిబలోపేతం చేసేందుకు రూ.1466.80 కోట్ల అంచనాతో 8,585 వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ (YSR Health Clinics) భవనాల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. డిసెంబర్ నాటికి నిర్మాణాలన్నీ పూర్తి కానున్నాయి.
Amaravati, August 23: ఏపీ ప్రభుత్వం గ్రామీణ ప్రజలకు వారి సొంతూరులోనే ప్రాథమిక వైద్య చికిత్సలు, వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకువస్తోంది. వైద్య ఆరోగ్య రంగాన్నిబలోపేతం చేసేందుకు రూ.1466.80 కోట్ల అంచనాతో 8,585 వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ (YSR Health Clinics) భవనాల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. డిసెంబర్ నాటికి నిర్మాణాలన్నీ పూర్తి కానున్నాయి. ఒక్కో విలేజ్ క్లినిక్‌లో అవుట్ పేషెంట్ రూమ్, ఎగ్జామినేషన్ రూం, లేబొరేటరీ, ఫార్మసీ, వెయిటింగ్ హాల్, ఏఎన్‌ఎం క్వార్టర్స్ ఉంటాయి. ప్రతి 2,500 జనాభాకు ఒక వైఎస్సార్ విలేజ్ క్లినిక్ (YSR Village Clinics) అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం డిసెంబర్‌లోగా బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన 7,112 మంది మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లను నియమించనుంది. ఇప్పటికే 2,920 క్లినిక్‌లలో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు అందుబాటులో ఉన్నారు.
ఈ క్లినిక్‌లో 12 రకాల వైద్య సేవలు అందించడంతో పాటు 14 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. 65 రకాల మందులతో పాటు 67 రకాల బేసిక్ మెడికిల్ ఎక్విప్‌మెంట్‌ను అందుబాటులో ఉంచుతారు. ఇప్పటికే 10,032 విలేజ్ క్లినిక్‌లలో ఏఎన్‌ఎంలు 24 గంటలూ అందుబాటులో ఉన్నారు. హెల్త్ అసిస్టెంట్‌తో పాటు ఆశా వర్కర్లు క్లినిక్‌లో ఉంటారు. విలేజ్ క్లినిక్స్‌ను పీహెచ్‌సీలు, ల్యాబ్‌లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానం చేస్తున్నారు. తద్వారా టెలి మెడిసిన్ వైద్య సదుపాయాన్ని కూడా కల్పించనున్నారు.
మండలానికి రెండు పీహెచ్‌సీలను అందుబాటులోకి తేవడమే కాకుండా ఒక్కో పీహెచ్‌సీలో ఇద్దరేసి డాక్టర్లు ఉంటారు. ఆరోగ్య శ్రీ కార్డుల ద్వారా సంబంధిత వ్యక్తి వివరాలన్నీ కూడా విలేజ్ క్లినిక్స్‌కు అందుబాటులో ఉంచుతారు. ఆరోగ్య శ్రీ కార్డు క్యూ ఆర్‌కోడ్ ద్వారా ప్రజల ఆరోగ్య సమాచారం స్పష్టంగా ఉంటుంది. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో భాగంగా వైద్యుడు ఆ గ్రామానికి వెళ్లినప్పుడు చికిత్సకు ఆరోగ్య శ్రీ కార్డులోని వివరాలు ఎంతగానో ఉపయోగపడతాయి. దీంతో సత్వరమే నిర్ధారణలతో కూడిన వైద్యం అదించడానికి ఉపయోగపడుతుంది.
12 రకాల ప్రాథమిక వైద్య సదుపాయాలు
– గర్భిణులకు, చిన్నారుల సంరక్షణకు అవసరమైన వైద్య సేవలు
– నవజాత శిశు ఆరోగ్య సంరక్షణ సేవలు
– బాల్యం, కౌమార దశ ఆరోగ్య సంరక్షణ సేవలు
– కుటుంబ నియంత్రణ, గర్భ నిరోధక సేవలు, ఇతర పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణ సేవలు
– అంటు వ్యాధుల నిర్వహణ.. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు
– తీవ్రమైన సాధారణ అనారోగ్యాలు, చిన్న జబ్బులకు జనరల్ అవుట్ పేషెంట్ కేర్
– అసాంక్రమిక వ్యాధుల స్క్రీనింగ్, నివారణ, నియంత్రణ, నిర్వహణ
– సాధారణ ఆఫ్తాల్మిక్ (కంటి సమస్యలు), ఈఎన్‌టీ సమస్యల కోసం జాగ్రత్తలు
– ప్రాథమిక నోటి ఆరోగ్య సంరక్షణ
– వృద్ధాప్య వ్యాధులకు చికిత్స, ఉపశమన ఆరోగ్య సంరక్షణ సేవలు
– కాలిన గాయాలకు, ప్రమాదాల్లో గాయపడిన (ట్రామా) వారికి అత్యవసర వైద్య సేవలు
– మానసిక ఆరోగ్య వ్యాధుల స్క్రీనింగ్, ప్రాథమిక నిర్వహణ
14 రకాల ప్రాథమిక పరీక్షలు
► హిమోగ్లోబిన్, గర్భవతులకు యూరిన్ పరీక్ష, ఇతర యూరిన్ టెస్టులు, బ్లడ్ షుగర్, మలేరియా, హెచ్‌ఐవీ, డెంగీ, కంటి పరీక్షలు, అయోడిన్ సాల్ట్ పరీక్షలు, వాటర్ టెస్టింగ్, హెపటైటిస్ బి, ఫైలేరియా, ర్యాపిడ్ టెస్ట్, కఫం పరీక్షలు.