Khairathabad Ganesh 2020: ధన్వంతరి నారాయణుడిగా దర్శనమిస్తున్న ఖైరతాబాద్ గణేష్! కరోనా మహమ్మారి నేపథ్యంలో ధన్వంతరి అవతారం యొక్క విశిష్టత ఏంటో తెలుసుకోండి
మరి ఈ ధన్వంతరి ఎవరు? ధన్వంతరి గణేషుడి యొక్క విశిష్టత ఎంటో తెలుసా? అయితే చదవండి....
Khairathabad Dhanvantari Ganesh 2020: వినాయక చవితి హిందువులు ఘనంగా జరుపుకునే పండగల్లో ఒకటి, ముఖ్యంగా ముంబై, పుణె మరియు హైదరాబాద్ నగరాల్లో జరిగే గణేష్ ఉత్సవాలు దేశంలో చాలా ప్రసిద్ధి. విభిన్న రకాల గణనాథుడి విగ్రహాలను ప్రతిమలతో, అందమైన అలంకరణలతో పది రోజుల పాటు గణేష్ ఉత్సవాలు కోలాహలంగా జరుగుతాయి. అయితే ఈ 2020 ఏడాదిలో కరోనా మహమ్మారి కారణంగా ఉత్సవాలు నిరాడంబరంగా సాగుతున్నాయి.
హైదరాబాద్ నగరంలో కూడా ఈ ఏడాది వేడుకలు నిరాడంబరంగానే అయినా ఘనంగానే నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాలు అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ బడా గణేష్. ముంబైలోని లాల్‌బాగ్చ రాజా మాదిరిగానే హైదరాబాద్‌కు చెందిన ఖైరతాబాద్ గణేష్ పండల్ ఏటా వేల సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తుంది. గత సంవత్సరం, ఖైతరాబాద్ గణేశుడు 60 అడుగుల ఎత్తులో నిలబడ్డాడు, కాని ఈ సంవత్సరం, కరోనా నేపథ్యంలో వేడుకల ఆర్భాటాన్ని తగ్గించడం కోసం విగ్రహం యొక్క పరిమాణాన్ని 9-అడుగులకు తగ్గించారు. అయితే ఆసక్తికరంగా ఈ ఏడాది ఖైరతాబాద్ గణేశుడు ధన్వంతరి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. మరి ఈ ధన్వంతరి ఎవరు? ధన్వంతరి గణేషుడి యొక్క విశిష్టత ఎంటో తెలుసా? అయితే చదవండి.
ధన్వంతరి గణేషుడి ఇతివృత్తం
ధన్వంతరి అంటే మహా విష్ణువు యొక్క మరొక అవతారం, పురణాల ప్రకారం దేవతలు, అసురులు అమృతం కోసం క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు ఒకసారి కూర్మ (తాబేలు) అవతారంలో కనిపించగా మరోసారి ధన్వంతరి రూపంలో ఉద్భవిస్తాడు. ఈ ధన్వంతరి నారాయణున్నే ఆయుర్వేదం దేవుడిగా, వైద్యుల దేవుడిగా చెప్తారు. సకల ఆయురారోగ్యాలు ప్రసాదించే దేవుడిగా ధన్వంతరిని దేవతలు కొలిచేవారని పురాణాలు చెబుతున్నాయి. అలా ఉద్భవించిన రోజును ధన్వంతరి త్రయోదశి లేదా దంతేరాస్‌గా కూడా పిలుస్తారు. భారత ప్రభుత్వం కూడా ఇప్పటికే ఈ ధన్వంతరి త్రయోదశిని జాతీయ ఆయుర్వేద దినోత్సవంగా కూడా ప్రకటించింది. శివుడు వినాయకునికి చెప్పిన మంత్రం ఏమిటి? ఆసక్తిర కథనం చదవండి
ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అతి ముఖ్యమైన సమస్య కరోనావైరస్. ఈ కరోనా మహామ్మారిని అంతం చేసే విరుగుడు కోసం ప్రపంచం ఆత్రంగా ఎదురుచూస్తుంది. ఇప్పుడు ఇదే ఇతివృత్తంతో మన ఖైరతాబాద్ గణేష్ కొలువుదీరాడు. మరి మన ధన్వంతరి గణేషుడు ఆ మహమ్మారిని అంతం చేసే విరుగుడును అందించి, మనందరినీ ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాడని కోరుకుందాం.