River Tragedy: నిజామాబాద్ జిల్లాలో విషాద ఘటన, గోదావరి నదిలో స్నానం చేయడానికి వెళ్లి ఆరుగురు గల్లంతు, మృతదేహాలు లభ్యం
మెండోరా వద్ద గల పుష్కరఘాట్ నుంచి గోదావరి నదిలో శుక్రవారం పుణ్య స్నానం చేసేందుకు వెళ్లిన ఆరుగురు నదిలో గల్లంతయ్యారు. వీరిలో ఒకరు సురక్షితంగా బయటపడగా, ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి, మిగతా వారి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి....
Nizamabad, April 2: నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడ్- శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ సమీపంలో విషాదం చోటుచేసుకుంది. మెండోరా వద్ద గల పుష్కరఘాట్ నుంచి గోదావరి నదిలో శుక్రవారం పుణ్య స్నానం చేసేందుకు వెళ్లిన ఆరుగురు నదిలో గల్లంతయ్యారు. గాలింపు చర్యలు చేపట్టగా ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. గోదావరి నదిలో ప్రతి శుక్రవారం గోదావరి నదిలో తెప్ప దీపం సమర్పించడానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ ఘటన జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం, నిజామాబాద్ లోని ఎల్లమ్మగుట్ట, డీకంపల్లి, గుత్ప, మాక్లూర్ ప్రాంతాలకు చెందిన మూడు కుటుంబాలకు చెందిన వారు శుక్రవారం ఉదయం గోదావరి పుష్కర ఘాట్ వద్దకు వచ్చారు. స్నానాలు చేసేందుకు నదిలోకి దిగుతున్న సమయంలో ఇద్దరు పిల్లలు నదిలోకి జారిపోయారు. వారిని కాపాడే క్రమంలో మరో ఐదుగురు నదిలోకి దిగగా వారు కూడా గల్లంతయ్యారు. స్థానికుల సహాయంతో ఒకరు సురక్షితంగా బయటపడగా మిగతా నలుగురు గల్లంతయ్యారు. ఇక వారి కోసం పోలీసులు గజ ఈతగాలను నియమించి గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే దురదృష్టవశాత్తూ ఎవరూ ప్రాణాలతో తిరిగి రాలేదు. ఆ ఆరుగురి మృతదేహాలు బయటకు తీయడంతో నిజామాబాద్ జిల్లాలో విషాదం అలుముకుంది.
బాధితులను సురేష్ (40), యోగేష్ (16), బొబ్బిలి శ్రీనివాస్ (40), బొబ్బిలి సిద్ధార్థ్ (16), శ్రీకర్ (14), రాజు (24) గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.
ఇక ఈ దుర్ఘటన పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్నానం చేయడానికని నదిలో దిగి దురదృష్టవశాత్తు మృత్యువాత పడడం కలచివేసిందని సీఎం విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.