Teenmar Mallanna Arrested: తీన్మార్ మల్లన్న అరెస్ట్, జ్యోతిష్యుడిని బ్లాక్ మెయిల్ చేసి రూ.30 లక్షలు డిమాండ్ చేశాడని ఆరోపణలు, చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసిన మారుతి జ్యోతిష్యాలయం నిర్వాహకుడు సన్నిధానం లక్ష్మీకాంతశర్మ
ఈ ఏడాది ఏప్రిల్‌లో నమోదైన ఒక కేసులో ఆయనకు రెండుసార్లు నోటీసులు ఇచ్చి విచారించామని, ఇప్పుడు అరెస్టు చేశామని ప్రకటించారు.
Hyderabad, August 28: క్యూ న్యూస్ చానల్ వ్యవస్థాపకుడు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను హైదరాబాద్‌లోని చిలకలగూడ పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు (Teenmar Mallanna Arrested) చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో నమోదైన ఒక కేసులో ఆయనకు రెండుసార్లు నోటీసులు ఇచ్చి విచారించామని, ఇప్పుడు అరెస్టు చేశామని ప్రకటించారు. తీన్మార్ మల్లన్న తనను బెదిరిస్తున్నారంటూ (alleged extortion case ) సికింద్రాబాద్ మధురానగర్ కాలనీలోని మారుతి జ్యోతిష్యాలయం నిర్వాహకుడు సన్నిధానం లక్ష్మీకాంతశర్మ ఈ ఏడాది ఏప్రిల్ 22న చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఎన్నోఏళ్లుగా తాను జ్యోతిషాలయం నిర్వహిస్తున్నానని.. కానీ ఇటీవల కొందరు వ్యక్తులు నకిలీ భక్తులను పంపి తనను ఇబ్బంది పెడ్తున్నారని, తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏప్రిల్ 19న తీన్మార్ మల్లన్న (Activist Teenmaar Mallanna) తనకు వాట్సాప్ ద్వారా ఫోన్ చేసి రూ.30 లక్షలు డిమాండ్ చేశారని ఆరోపించారు. డబ్బులు ఇచ్చేందుకు తాను నిరాకరించడంతో తప్పుడు ప్రచారం చేయిస్తానంటూ బెదిరించారని ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలోనే ఏప్రిల్ 20న తన చానల్‌లో తప్పుడు వార్తను ప్రసారం చేసి బెదిరించాడన్నారు. దీంతో పోలీసులు మల్లన్నపై కేసు నమోదు చేశారు. ఈ నెల 3న ఆయన కార్యాలయంలో సోదాలు చేశారు. రెండుసార్లు పోలీసుస్టేషన్‌కు పిలిపించి విచారించారు. శుక్రవారం రాత్రి అరెస్టు చేసినట్టుగా ప్రకటించారు. మల్లన్నపై ఉన్న మరికొన్ని కేసుల్లోనూ పీటీ వారెంట్ల ద్వారా అరెస్టులు చేయనున్నట్టు సమాచారం. మల్లన్నపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి.