Bathukamma Sarees: నేటి నుంచే బతుకమ్మ చీరల పంపిణీ, రాష్ట్రవ్యాప్తంగా కోటికి పైగా చీరలు పంపిణీ చేయనున్న ప్రభుత్వం, 24 రకాల డిజైన్లు, 10 రంగులు, 240 రకాల త్రెడ్ బోర్డర్ తో ఆకర్షణీయంగా చీరెలు
కార్యక్రమం ప్రారంభించిన 2017 నుంచి నేటి వరకు(ఈ ఏడాది చీరలతో కలుపుకొని) 5.81 కోట్ల చీరలను తెలంగాణ ఆడబిడ్డలకు అందించినట్టవుతుంది.
Hyderabad, SEP 22: తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయానికి ప్రతీకైన బతుకమ్మ పండుగకు సర్కారు సారె (Saree) సిద్ధం చేసింది. ప్రతి ఇంటా ఆడబిడ్డలు ఆనందంతో ఉండేలా ప్రతి ఏటా ఇచ్చే బతుకమ్మ చీరల (Bathukamma Sarees ) పంపిణీ ఇవాల్టి నుంచి ప్రారంభించనున్నట్టు పరిశ్రమలు,చేనేత, జౌళి శాఖ మంత్రి కే తారకరామారావు (KTR) తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులకు చేయూతనివ్వడంతోపాటు ఆడబిడ్డలకు చిరుకానుక ఇవ్వాలన్న మహోన్నత లక్ష్యంతో 2017లో చీరల పంపిణీ ప్రారంభించినట్టు ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఇవాళ్టి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ (Sarees distribution) కార్యక్రమం జరుగుతుందని..ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ చేనేత శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు.
నేతన్నలను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే, కేంద్రం టెక్స్‌టైల్ ఉత్పత్తులపై జీఎస్టీ (GST) విధిస్తూ వారి బతుకుల్ని ఆగం చేస్తున్నదని మంత్రి విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నారు. 24 రకాల డిజైన్లు, 10 రకాల ఆకర్షణీయ రంగులు, 240 రకాల త్రెడ్‌బోర్డర్ (దారపు పోగుల అంచులు)తో 100 శాతం పాలిస్టర్ ఫిలమెంట్ నూలు చీరలను తయారు చేశారు. ఆరు మీటర్ల (5.50+1.00) పొడవుతో 92 లక్షల సాధారణ చీరలకు అదనంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వయోవృద్ధ మహిళలు ధరించే 9 మీటర్ల పొడవుగల చీరలు 8 లక్షలు తయారు చేయించారు.
మొత్తంగా కోటి బతుకమ్మ చీరలను రాష్ట్రంలో ఆహార భద్రత కార్డు కలిగి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్క ఆడబిడ్డకు అందించనుండగా, ఇందుకోసం ప్రభుత్వం రూ.339.73 కోట్లు ఖర్చు చేసింది. కార్యక్రమం ప్రారంభించిన 2017 నుంచి నేటి వరకు(ఈ ఏడాది చీరలతో కలుపుకొని) 5.81 కోట్ల చీరలను తెలంగాణ ఆడబిడ్డలకు అందించినట్టవుతుంది.