KTR Counter to Revanth Reddy: నువ్వు చీరకట్టుకుంటావా? రాహుల్ గాంధీకి చీర కట్టిస్తావా? మహిళలకు రూ. 2500 ఇస్తున్నామంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
నువ్వు మంచిగ చీరకట్టుకుని.. ఆడపిల్లలా రెడీ అయ్యి ఆర్టీసీ బస్సు ఎక్కు.. ఒకవేళ నిన్ను టికెట్ అడిగితే ఆరు గ్యారంటీలు అమలు చేయనట్టే అని కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాలు విసిరారు
Hyderabad, May 05: రాష్ట్రంలోని మహిళలకు నెలకు 2500 రూపాయలను నేరుగా బ్యాంక్ అకౌంట్‌లో వేస్తున్నామంటూ నిర్మల్ సభలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పందించారు. మహిళలకు నెలకు రూ.2500 ఎక్కడ ఇస్తున్నారో చూపిస్తావా? అని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. ఇన్ని పచ్చి అబద్ధాలు చెబుతారా? అని ట్విట్టర్ (X ) వేదికగా అగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీలు అమలు కావడం లేదని ప్రశ్నించిన కేటీఆర్‌పై ఇటీవల రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నువ్వు మంచిగ చీరకట్టుకుని.. ఆడపిల్లలా రెడీ అయ్యి ఆర్టీసీ బస్సు ఎక్కు.. ఒకవేళ నిన్ను టికెట్ అడిగితే ఆరు గ్యారంటీలు అమలు చేయనట్టే అని కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. ఆడపిల్లలకు రూ.2500 ఇస్తున్నామని రాహుల్ చేసిన వ్యాఖ్యలతో పాటు.. రేవంత్ రెడ్డి కామెంట్లపైనా ట్విట్టర్ వేదికగా కేటీఆర్ (Ktr Satires On Rahul Gandhi) స్పందించారు. రేవంత్ రెడ్డి చీర నువ్వు కట్టుకుంటావా? లేదా రాహుల్ గాంధీకి కట్టిస్తావా? అని సెటైర్ వేశారు.
తెలంగాణలో ఉన్న 1.67 కోట్ల మంది 18 ఏండ్లు నిండిన ఆడబిడ్డలు ఆ డబ్బుల గురించి అడుగుతున్నారని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. వంద రోజుల్లో అన్ని గ్యారంటీలు అమలు చేస్తామని ఇచ్చిన మాట తప్పినందుకు కాంగ్రెస్ పార్టీ బొంద పెట్టేది తెలంగాణ ఆడబిడ్డలే అని మండిపడ్డారు. డైలాగులేమో ఇందిరమ్మ రాజ్యం అని.. చేసేదేమో సోనియమ్మ జపం అని ఎద్దేవా చేశారు. మహిళా సంక్షేమంలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు.
కేసిఆర్ కిట్ ఆగింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది, కల్యాణ లక్ష్మి నిలిచింది, తులం బంగారం అడ్రస్ లేదు. ఫ్రీ బస్సు అని బిల్డప్, అందులో సీట్లు దొరకవు, ముష్టి యుద్ధాలు చేసే దుస్థితి వచ్చిందని కేటీఆర్ అన్నారు. హామీలు అన్నింటినీ అటకెక్కించిన కాంగ్రెస్‌కు ఓటు అడిగే హక్కు లేదని స్పష్టం చేశారు. చిల్లర మాటలు, ఉద్దెర పనులు తప్ప నువ్వు నీ అసమర్థ ప్రభుత్వం చేసిందేమి లేదని అందరికీ తెలిసిపోయింని అన్నారు.