Attack on Harish Rao Office: సిద్ధిపేటలో అర్ధరాత్రి హైడ్రామా.. హరీశ్ రావు క్యాంప్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి.. వీడియో వైరల్
మాజీమంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య ముదిరిన రుణమాఫీ సవాళ్లు ఫ్లెక్సీలను దాటి దాడుల వరకూ చేరుకున్నది.
Siddipet, Aug 17: మాజీమంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) మధ్య ముదిరిన రుణమాఫీ సవాళ్లు ఫ్లెక్సీలను దాటి దాడుల వరకూ చేరుకున్నది. సిద్ధిపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి కాంగ్రెస్ (Congress) కార్యకర్తలు హల్ చల్ చేశారు. బీఆర్ఎస్ (BRS) నేత హరీశ్ రావు (Harish Rao) క్యాంపు ఆఫీసుపై దాడికి పాల్పడ్డారు. క్యాంప్ గేట్లు బద్ధలు కొట్టి ఫ్లెక్సీలు చించేసి హంగామా చేశారు. ఆఫీస్ పైకెక్కి హడావిడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు.. జై కాంగ్రెస్, జైజై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ మాటతప్పకుండా రుణమాఫీ చేసినందుకు హరీష్‌రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకోవడానికి బీఆర్‌ఎస్ కార్యకర్తలు వచ్చారు. దీంతో క్యాంప్ ఆఫీస్ దగ్గర అర్ధరాత్రి హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
పోలీసులు రావడంతో..
విషయం తెలుసుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను బయటకు పంపించేశారు. ఆఫీసుపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాగా, కాంగ్రెస్ రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న హరీశ్ వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.