Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో తీహార్ జైలుకు కవిత, ఏప్రిల్ 9వ తేదీ వరకు రిమాండ్ విధించిన న్యాయస్థానం, కోర్టులో వాదనలు ఎలా సాగాయంటే..

లిక్కర్‌ స్కాం కేసులో కస్టడీ ముగియడంతో ఈడీ ఇవాళ రౌస్‌ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు.

BRS MLC Kavitha arrested under Money Laundering Hawala Act Says ED

Delhi excise policy money laundering case: ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు 14 రోజుల పాటు జ్యూడీషియల్‌ రిమాండ్‌ విధించింది ట్రయల్‌ కోర్టు.దీంతో ఆమెను తీహార్‌ జైలుకు అధికారులు తరలించనున్నారు. లిక్కర్‌ స్కాం కేసులో కస్టడీ ముగియడంతో ఈడీ ఇవాళ రౌస్‌ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు.

ఏప్రిల్ 9వ తేదీ వరకు కవిత జ్యూడీషియల్ కస్టడీలో ఉండనున్నారు. ఏప్రిల్ 9 న ఉదయం 11 గంటలకు కోర్టులో హాజరుపరచాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే, కవితను కస్టడీకి ఇవ్వడం ఇది మూడోసారి. మొదట 7 రోజులు, ఆ తరువాత 3 రోజులు, ఇప్పుడు 14 రోజులు జ్యూడీషియల్ కస్టడీకి ఇచ్చింది న్యాయస్థానం. కవితను తీహార్ జైలుకు తరలించి.. అక్కడే విచారణ జరుపుతాతరని అధికార వర్గాలు చెబుతున్నారు.

ఈ కేసులో కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారు. తన కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కవిత కోరారు. అయితే, ఈ పిటిషన్‌పై సమాధానం ఇచ్చేందుకు సమయం కావాలని కోర్టును ఈడీ కోరింది. దీంతో సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ బెయిల్ పిటిషన్‌పై ఏప్రిల్ 1వ తేదీన విచారణ జరుపుతామని న్యాయస్థానం తెలిపింది. ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు, కడిగిన ముత్యంలో బటయకు వస్తానని తెలిపిన ఎమ్మెల్సీ కవిత

ఈడీ జ్యూడీషియల్‌ కస్టడీ కోరగా.. అదే సమయంలో కవిత వేసిన బెయిల్‌ పిటిషన్‌పైనా వాదనలు జరిగాయి. సమాజంలో కవిత చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. ఆమెను విడుదల చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. సాక్షాధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉంది. దీనివల్ల దర్యాప్తుకు తీవ్ర విఘాతం కలుగుతుందని ఈడీ వాదించింది.

లిక్కర్ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. కవిత పాత్రకు సంబంధించి ఇంకా లోతైన దర్యాప్తు చేస్తున్నాం. అక్రమ సొమ్ము గుర్తించే పనిలో ఉన్నాం. ఆర్థిక నేరాల దర్యాప్తు చాలా కఠినమైనది. ఆర్థిక నేరస్తులు చాలా వనరులు, పలుకుబడి ఉన్నవారు. పథకం ప్రకారం ప్రణాళికతో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. అందుకే దర్యాప్తు అనేది చాలా జఠిలమైనది. ఇందుకోసమైనా కవితను జ్యూడిషియల్ కస్టడీ కి పంపాలని ఈడీ కోర్టును కోరింది. ఈడీ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఆమెకు జ్యూడీషియల్‌ రిమాండ్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

కోర్టుకు వచ్చే ముందు ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్స్ చేశారు. ఈ కేసులో తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని అన్నారు. ఇది మనీలాండరింగ్ కేసు కాదని, పొలిటికల్ లాండరింగ్ కేసు అని విమర్శించారు. తనను తాత్కాలికంగా జైలులో పెట్టొచ్చన్నారు. క్లీన్‌చిట్‌తో బయటకు వస్తానని అన్నారు. తాను ఏ తప్పు చేయలేదని, అప్రూవర్‌గా మారనని అన్నారు. ఈ కేసులో ఒక నిందితుడు బీజేపీలోకి చేరితే.. 2వ నిందితుడికి బీజేపీ టిక్కెట్ ఇచ్చిందని కవిత వ్యాఖ్యానించారు. మూడో నిందితుడు రూ. 50 కోట్ల ఫండ్స్ బీజేపీకి ఇచ్చారని అన్నారు.