IPL Auction 2025 Live

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు, కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ మే 6కి వాయిదా, కోర్టులో వాదనలు ఎలా సాగాయంటే..

సీబీఐ (CBI) కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పును మే 6కి వాయిదా వేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

BRS Leader K Kavitha (File Image)

New Delhi, May 2: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో (Delhi Liquor Scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) మరోసారి నిరాశ ఎదురైంది. సీబీఐ (CBI) కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పును మే 6కి వాయిదా వేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ కవిత బెయిల్ పిటిషన్లపై తీర్పును మే 6న వెలువరిస్తామని జడ్జి కావేరి బవేజా గురువారం ప్రకటించారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత జైలుపాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కవిత.. తనను సీబీఐ అరెస్టు చేయడంపై న్యాయపోరాటం చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మార్చి 15 న అరెస్టు చేశారు. ఢిల్లీ కోర్టు కస్టడీ విధించడంతో ఆమెను తీహార్ జైలుకు పంపించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు, సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, బీఆర్‌ఎస్‌ లీడర్‌ కే కవిత జ్యుడీషియల్‌ కస్టడీ మే 7 వరకు పొడిగింపు

జైలులో ఉన్న కవితను ఇదే కేసులో ఈ నెల 11న సీబీఐ కూడా అరెస్టు చేసింది. కోర్టు అనుమతితో అధికారులు ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ అరెస్టులపై కోర్టులో కవిత పోరాడుతున్నారు. ఈడీ, సీబీఐ కేసులలో బెయిల్ కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.తొలుత మధ్యంతర బెయిల్ కోసం కవిత దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. దీంతో పూర్తిస్థాయి బెయిల్ కోసం కవిత మరో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ఈడీ, సీబీఐ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. కవితకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను బెదిరించే అవకాశం ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసులో ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేస్తూ బెయిల్ పిటిషన్ తిరస్కరించాలని కోర్టును అభ్యర్థించారు. అటు కవిత తరఫున వాదనలు కూడా విన్న న్యాయస్థానం.. నేడు (గురువారం) తీర్పు వెలువరిస్తుందని భావించగా మరోసారి వాయిదా వేసింది.

మహిళగా కవిత బెయిల్‌కు అర్హురాలని, అరెస్ట్ నుంచి విచారణ వరకు కవితకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని వాదనలు కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. బీఆర్ఎస్ పార్టీకి స్టార్ క్యాంపైనర్‌గా ఉన్నందున ఎన్నికల్లో ప్రచారం కోసం బెయిల్ ఇవ్వాలని కవిత కోరారు. ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసులకు అరెస్ట్ అవసరం లేదని, కవిత అరెస్టుకు సరైన కారణాలు లేవని, మహిళగా ఆరోగ్యపరమైన కారణాలు పరిగణలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేయాలని కవిత న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు.