Pawan Kalyan On Disha Case: ఈ చట్టాలు సరిపోవు, విదేశాల్లోని చట్టాలను అధ్యయనం చేయాలి, బహిరంగ శిక్షలు అమలు చేయాలి, నేరస్థాయిని బట్టి మరణశిక్ష అయినా సరే: పవన్ కళ్యాణ్

జాతీయ మీడియా సైతం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ప్రత్యేకంగా ప్రస్తావించాయి...

File image of Pawan Kalyan | File Photo

Hyderabad, December 06:  ఆ కరాళ రాత్రి వేళ నలుగురు ముష్కరుల మధ్య దిశ ఎంత నరకయాతన అనుభవించిందో తెలుసుకుంటేనే ఆవేశం, ఆక్రోశం, ఆవేదనతో శరీరం ఉడికిపోతుందని, దిశ ఉదంతంలో జాతి యావత్తు తక్షణ న్యాయం కోరుకోవడానికి కారణం ఈ ఆవేదనే అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు.

ఇక్కడితో దిశ సంఘటన (Disha Case) ముగిసిందని దీనిని ఇంతటితో వదిలిపెట్టకూడదు. మరే ఆడపిల్లకు ఇలాంటి పరిస్థితి రాకూడదు. నిర్భయ చట్టం (Nirbhaya Act) తీసుకొచ్చినా అత్యాచారాలు ఆగలేదు, అంటే అంతకంటే కఠినమైన నిర్ణయాలు, ఆడపిల్లల వైపు వక్రబుద్ధితో చూడాలంటేనే భయపడే విధంగా కఠినాతి కఠినమైన చట్టాలు రావలసిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇతర దేశాలలో ఎటువంటి చట్టాలు ఉన్నాయో అధ్యయనం చేయాలని సూచించారు.

ఇలాంటి కేసులలో కోర్టుల పరంగా తక్షణ న్యాయం లభించాలి. రెండు మూడు వారాలలోనే శిక్షలు పడేలా నిబంధనలు రావాలి. ఆడపిల్లల శ్రేయస్సు దృష్ట్యా శిక్షలు బహిరంగంగా అమలు చేయాలి, నేర స్థాయినిబట్టి అది మరణ శిక్షఅయినా, మరే ఇతర శిక్ష అయినా సరే, బహిరంగంగా అమలు జరపాలి అని పవన్ అన్నారు. ప్రజలు కోరుకున్న విధంగా దిశ ఉదంతంలో సత్వర న్యాయం లభించింది. ఈ సందర్భంగా దిశ ఆత్మకు శాంతి కలగాలని,ఈ విషాదం నుంచి ఆమె తల్లిదండ్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

కాగా, పవన్ కళ్యాణ్ అంతకు ముందు నేరస్థులను చంపకూడదు, బెత్తంతో కొట్టాలి, కఠినంగా శిక్షించాలి అంటూ చేసిన వ్యాఖ్యలతో తీవ్రంగా విమర్శల పాలయ్యారు. జాతీయ మీడియా సైతం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ప్రత్యేకంగా ప్రస్తావించాయి. దీంతో సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు ఆయనపై దుమ్మెత్తిపోశారు. అయినప్పటికీ దిశ ఎన్‌కౌంటర్‌ను సమర్థిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పకపోవటం గమనార్హం.