EC Shocker: 107 మంది తెలంగాణ అభ్యర్థులపై ఈసీ వేటు.. ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం.. గత ఎన్నికల్లో పోటీ చేసి.. ఖర్చు వివరాలు సమర్పించని సదరు అభ్యర్థులు.. 10ఏ కింద అనర్హత చర్యలు తీసుకున్న ఈసీ
వీరంతా గత ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు పోటీ చేశారు.
Hyderabad, Oct 21: తెలంగాణకు (Telangana) చెందిన 107 మంది అభ్యర్థులపై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) వేటు వేసింది. వీరంతా గత ఎన్నికల్లో అసెంబ్లీ (Assembly), లోక్ సభ (Loksabha) స్థానాలకు పోటీ చేశారు. అయితే, ఈ 107 మంది గత ఎన్నికల్లో తమ ఖర్చుకు సంబంధించిన వివరాలు సమర్పించకపోవడంతో కేంద్ర ఎన్నికల సంఘం వీరిని అనర్హులుగా ప్రకటించింది. వీరిలో 72 మంది లోక్ సభ స్థానాల్లో పోటీ చేసినవారే. ఈసీ వేటుకు గురైన వారిలో ఒక్క నిజామాబాద్ లోక్ సభ నియోజకర్గానికి చెందినవారు 68 మంది ఉన్నారు. మిగతా వారిలో మెదక్, మహబూబాబాద్ నుంచి ఒక్కొక్కరు, నల్గొండ లోక్ సభ స్థానం నుంచి ఇద్దరు ఉన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన అనర్హత వేటుకు గురైన వారి సంఖ్య 35.
నిషేధం ఎప్పటివరకంటే?
ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 10ఏ కింద వీరందరి పైనా అనర్హత వేటు పడింది. వీరిపై అనర్హత వేటు 2021 జూన్ నుంచి వర్తించనుంది. 2024 జూన్ వరకు వీరు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. ఎన్నికల్లో పోటీ చేసిన వారు, ఎన్నికల్లో తమ ఖర్చుకు సంబంధించిన వివరాలను ఈసీకి సమర్పించాల్సి ఉంటుంది. అలా సమర్పించనివారిపై ఈసీ సెక్షన్ 10ఏ కింద చర్యలు తీసుకునే వీలుంటుంది.