IPL Auction 2025 Live

Notification For 4th Phase Elections: నాలుగో ద‌శ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ గెజిట్ విడుద‌ల‌, నామినేష‌న్ల ప్ర‌క్రియ షురూ, తెలుగు రాష్ట్రాలు స‌హా ఎక్క‌డెక్క‌డ ఎన్నిక‌లున్నాయంటే?

ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్‌ పత్రాలను స్వీకరిస్తారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 3.30 కోట్ల మంది ఓటుహక్కును వినియోగించుకోనుండగా, వారి కోసం 35 వేల పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

Election Commission (File Photo)

New Delhi, April 18: నాలుగో విడుత సాధారణ ఎన్నికలకు (Lok Sabha Elections) నోటిఫికేషన్‌ వెలువడింది. పది రాష్ట్రాల్లోని 96 లోక్‌సభ స్థానాలతోపాటు తెలంగాణలోని సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (EC) గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఉదయం 11 గంటలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను 29న ప్రకటిస్తారు. మే 13న పోలింగ్‌ జరుగుతుంది. జూన్‌ 4న ఫలితాలు వెల్లడిస్తారు. నాలుగో విడతలో లోక్‌సభ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, జమ్ముకశ్మీర్‌ ఉన్నాయి. వీటిలో మొత్తం 96 లోక్‌సభ స్థానాల్లో ఈ దశలో ఎన్నికలు జరగనున్నాయి.

 

రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్‌ పత్రాలను స్వీకరిస్తారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 3.30 కోట్ల మంది ఓటుహక్కును వినియోగించుకోనుండగా, వారి కోసం 35 వేల పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. 1.80 లక్షలమంది పోలింగ్‌ సిబ్బంది, మరో 25 వేలమంది ఇతర సిబ్బంది, 60 వేలమంది పోలీసులు విధులు నిర్వర్తిస్తారు. రాష్ట్రంలో మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా అందులో రెండు ఎస్టీ, మూడు ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గాలు ఉన్నాయి. లోక్‌సభ స్థానానికి ఈవీఎంపై తెలుపురంగు బ్యాలెట్‌ను ఉపయోగించగా, కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో మాత్రం గులాబీరంగు బ్యాలెట్‌ పేపర్‌ను ఉపయోగిస్తారు.

లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు కలెక్టరేట్లలో, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో నామినేషన్‌ పత్రాలు సమర్పించాలి. లోక్‌సభ అభ్యర్థి రూ.25 వేలు, శాసనసభ అభ్యర్థి రూ.10 వేలు ధరావతు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఇందులో 50 శాతం చెల్లిస్తే సరిపోతుంది. లోక్‌సభతోపాటే కంటోన్మెంట్‌ నియోజకవర్గ ఉపఎన్నికకు కూడా పోలింగ్‌ జరగనుంది. నియోజకవర్గంలో 2.51 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 232 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

తెలంగాణలో ఓటర్లు

మొత్తం ఓటర్లు ; 3,30,21,735

పురుషులు ; 1,64,31,777

మహిళలు ; 1,65,87,221

థర్డ్‌ జెండర్‌ ; 2,737

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్‌

నోటిఫికేషన్‌ విడుదల ఏప్రిల్‌ 18

నామినేషన్‌కు చివరి తేదీ ఏప్రిల్‌ 25

నామినేషన్ల పరిశీలన ఏప్రిల్‌ 26

ఉపసంహరణ చివరి తేదీ ఏప్రిల్‌ 29

పోలింగ్‌ తేదీ మే 13

ఓట్ల లెక్కింపు జూన్‌ 4