Telangana Assembly Sessions: అసెంబ్లీని కుదిపేసిన ఫార్ములా ఈ కార్ రేసు అంశం, కేటీఆర్‌కు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్, కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో కుదరదన్న ప్రభుత్వం
420 కాంగ్రెస్ ఇచ్చిన బూటకపు హామీలను ప్రశ్నించినందుకే అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.
Hyd, December 20: తెలంగాణ అసెంబ్లీని ఫార్ములా- ఈ రేస్ అంశం కుదిపేసింది.ఈ అంశంపై వెంటనే సభలో చర్చ నిర్వహించాలని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. 420 కాంగ్రెస్ ఇచ్చిన బూటకపు హామీలను ప్రశ్నించినందుకే అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.
రాజకీయ కక్ష సాధింపులు... ఫార్ములా- ఈ పైన కేసు అక్రమం అంటూ ప్లాకార్డుల ప్రదర్శన, నినాదాలు చేశారు. అలాగే నల్ల బ్యాడ్జీలతో సభకి హాజరయ్యారు. ఎంతకి బీఆర్ఎస్ సభ్యులు శాంతించకపోవడంతో సభను వాయిదా వేశారు స్పీకర్.
కేటీఆర్‌కి ఫార్ములా ఈ రేస్ మీద సభలో మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఒక సభ్యుడి మీద అక్రమ కేసు పెట్టినప్పుడు ఆ సభ్యుడికి చెప్పుకునే అవకాశం ఇవ్వాలి కదా అన్నారు. కేటీఆర్ మాట్లాడితే మీకు, ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ఒక క్లారిటీ వస్తుందన్నారు. ఇది ముమ్మాటికి అక్రమ కేసు అని మండిపడ్డారు హరీశ్. కేటీఆర్‌కు షాక్, ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏ1గా కేటీఆర్..ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌పై కేసు నమోదు చేసిన ఏసీబీ
ఇక అసెంబ్లీలో షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అనుచిత, అసభ్య ప్రవర్తన చేశారు. షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పు చూపించారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. అసెంబ్లీ ఫుటేజ్ బయటపెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.
ఇక మరోవైపు స్పీకర్ పై పేపర్లు విసరడాన్ని తప్పుబట్టారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. దళిత స్పీకర్ అయినందుకే అగ్రకుల దుహంకారంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్ రేసు వ్యవహారంపై సభలో చర్చ జరపలేమని, కేసు విచారణలో ఉన్న దశలో చర్చ చేపట్టడం కుదరదని తేల్చేశారు స్పీకర్.