Telangana Rains: భారీ వర్షాలు, రేపు తెలంగాణ వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు సెలవు, అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని హెచ్చరిక
హైదరాబాద్ సహా తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జనాలు అడుగు బయటపెట్టలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
Hyd, Sep 1: తుపాను ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జనాలు అడుగు బయటపెట్టలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... రేపు సాయంత్రం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. పలు చోట్ల రహదారులపై భారీగా వరద నీరు ప్రవహిస్తోందని తెలిపారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ రోడ్లు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక రివ్యూ, లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలని అధికారులకు సూచన
తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో కుండపోత వర్షం కురిసింది. శనివారం రాత్రి 8.30 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు వర్షపాతం వివరాలను తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీజీడీపీఎస్) వెల్లడించింది. అత్యధికంగా సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో 299.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో 298.0మి.మీ, సూర్యాపేట జిల్లా చిలుకూరులో 297.8మి.మీ వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ తెలిపింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో చిన్నగూడూరు 42.85, నెల్లికుదురులో 41.65, పెద్దనాగారం 40.28, కొమ్మల వంచలో 38.93, దంతాలపల్లి 33.25, మల్యాలలో 33, మరిపెడ 32.4, లక్కవరంలో 31.98, కేసముద్రం 29.8, ఆమన్‌గల్ 28, మహబూబాబాద్‌లో 27.25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రెడ్లవాడలో 43.55, కల్లెడలో 27.88 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో పలు కాలనీలు జలమయమయ్యాయి. ఓ ప్రైవేటు పాఠశాల ప్రాంగణంలోకి భారీగా వరదనీరు చేరి పాఠశాల బస్సులు నీటమునిగాయి. పాలేరు జలాశయానికి వరద పోటెత్తింది. జలాశయంలోకి 40 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. భారీ వర్షంతో వనపర్తి జిల్లాలో సరళ సాగర్‌కు వరద పోటెత్తింది. పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి.