Veterinary Doctor Murder Case: నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు పోలీసులపై సస్పెన్సన్ వేటు, ఫిర్యాదు అందితే వెంటనే కేసు నమోదు చేయాలన్న సైబరాబాద్ సీపీ సజ్జనార్, దారుణ హత్యకు నిరసనగా చిలుకూరి బాలాజీ టెంపుల్ మూసివేత
ఈ నెల 27న మిస్సింగ్ కేసు నమోదు చేసేందుకు బాధితురాలి కుటుంబ సభ్యులు స్టేషన్‌కు రాగా.. ఎఫ్ఐఆర్నమోదుకు పోలీసులు తీవ్ర కాలయాపన చేశారని ఉన్నతాధికారుల విచారణలో తేలింది.
Hyderabad, December 1: శంషాబాద్(Shamshabad)లో యువతి అదృశ్యంపై ఫిర్యాదు స్వీకరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినముగ్గురు పోలీసు అధికారులను సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ (Cyberabad CP Sajjanar)సస్పెండ్ చేశారు. ఈ నెల 27న మిస్సింగ్ కేసు నమోదు చేసేందుకు బాధితురాలి కుటుంబ సభ్యులు స్టేషన్‌కు రాగా.. ఎఫ్ఐఆర్నమోదుకు పోలీసులు తీవ్ర కాలయాపన చేశారని ఉన్నతాధికారుల విచారణలో తేలింది.
సంఘటన స్థలం తమ పరిధి కాదంటే, తమది కాదని ఆర్జీఐఏ పోలీసులు, శంషాబాద్ పోలీసులు తిప్పించారని తెలిసింది. దీంతో శంషాబాద్ గ్రామీణ పీఎస్ ఎస్సై రవికుమార్, ఎయిర్‌పోర్టు పీఎస్‌కు చెందిన ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు వేణుగోపాల్‌రెడ్డి, సత్యనారాయణగౌడ్‌లను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు.
27వ తేదీ రాత్రి శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో తప్పిపోయిన యువతికి సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో ఆలస్యం కావడంపై విచారణ జరిగింది. ప్రాథమిక నివేదిక ఆధారంగా ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేస్తున్నట్లు సీపీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తదుపరి ఆదేశాలు జారీచేసేవరకు ముగ్గురు సిబ్బందిపై సస్పెన్షన్ కొనసాగుతుందని తెలిపారు. ఫిర్యాదు అందితే అధికార పరిధితో సంబంధం లేకుండా కేసు నమోదు చేయాలని సీపీ (Cyberabad Police Commissioner)ఆదేశాలు జారీ చేశారు.
చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేత
వెటర్నరీ డాక్టర్ దారుణహత్య(Hyderabad Vet Rape-Murder Case)కు నిరసనగా శనివారం రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని(Chilkoor Balaji Temple) మూసివేశారు. ఉదయం 11 గంటల నుంచి 20 నిమిషాలపాటు ప్రదక్షణలు, దర్శనాలు పూర్తిగా నిలిపివేసి ఆలయాన్ని మూసివేశారు. అనంతరం ఆలయం ఎదుట ‘రక్షిద్దాం.. రక్షిద్దాం.. స్త్రీజాతిని రక్షిద్దాం’అంటూ భక్తులు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ మహాప్రదక్షణ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు రంగరాజన్ మాట్లాడుతూ.. ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఆగడం లేదని, వరుసగా జరుగుతున్న ఘటనలు చూస్తుంటే సమాజం ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. 9 నెలల పాప నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు రక్షణ లేకుండాపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మహిళలు సురక్షితంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణ, అర్చకులు కన్నయ్య, మురళీ తదితరులు పాల్గొన్నారు.