Gaddar Passed Away: అధికారిక లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు, అసెంబ్లీలో మౌనం పాటించిన ఎమ్మెల్యేలు, ఎల్బీ స్టేడియంలో నివాళులు అర్పించిన మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, సత్యవతి, పలువురు ఎమ్మెల్సీలు
తెలంగాణ గర్వించే బిడ్డ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (CM KCR) తెలిపారు. జీవితాంతం ప్రజల కోసం ఆయన చేసిన త్యాగాలు, ప్రజాసేవకు గౌరవ సూచకంగా దివంగత గద్దర్ అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
Hyderabad, Aug 07: తన జీవితకాలం ప్రజల కోసమే బతికిన ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ (Gaddar).. తెలంగాణ గర్వించే బిడ్డ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (CM KCR) తెలిపారు. జీవితాంతం ప్రజల కోసం ఆయన చేసిన త్యాగాలు, ప్రజాసేవకు గౌరవ సూచకంగా దివంగత గద్దర్ అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు గద్దర్ కుటుంబ సభ్యులతో మాట్లాడి అందుకు తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రజా గాయకుడు గద్దర్ (Gaddar) భౌతిక కాయానికి రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ (KTR) నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. మంత్రి కేటీఆర్ తోపాటు మంత్రులు ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ కూడా నివాళులర్పించారు. ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, క్రాంతి కిరణ్, బాల్క సుమన్, ఎమ్మెల్సీలు కవిత, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నాయకులు గద్దర్ బౌతిక కాయానికి నివాళులర్పించారు.
ప్రజా ఉద్యమాలను తీర్చిదిద్దిన మహాకళాకారుడు గద్దర్ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కొనియాడారు. తెలంగాణ అసెంబ్లీ ఆయనకు నివాళులర్పించింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ పాటకు ప్రపంచవ్యాప్తంగా కీర్తి తీసుకువచ్చిన ప్రజావాగ్గేయ కారుడు గద్దర్ ప్రసిద్ధి చెందిన గుమ్మడి విఠల్ అని కొనియాడారు. యావత్ తెలంగాణ ప్రజలకు దిగ్భ్రాంతి, దుఃఖాన్ని కలిగించిన వార్త అన్న అన్నారు. ప్రజాయుద్ధ నౌకగా పేరుగాంచి.. విప్లవ ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించి.. ఎన్నో సందర్భాల్లో ప్రజలను ఊర్రూతలూగించిన అద్భుతమైన గాయకుడు గద్దర్ అని ప్రశంసించారు. ప్రజా ఉద్యమాలను తీర్చిదిద్దన మహాకళాకారుడని, ఆయన లేని లోటు తీర్చలేనిది. పూడ్చలేనిదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన వేదికను పంచుకున్నామని గుర్తు చేసుకున్నారు. ఎన్నో సందర్భాల్లో ఉత్సాహాన్ని నింపిన అద్భుతమైన కళాకారుడని, ఆయన లేకపోవడం బాధాకరమన్నారు. శాసనసభ, ప్రభుత్వం తరఫున సంతాపం ప్రకటించారు. ప్రజాకళలు వర్ధిల్లినంత కాలం, జానపదం ఉన్నంత కాలం ఆయన పేరు అజరామరంగా నిలిచి ఉంటుందన్నారు. ఆయన కుటుంబానికి కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నామన్న కేటీఆర్.. కుటుంబంతో పాటు ఆయన మిత్రులకు మనోధైర్యాన్ని, ఆత్మస్థయిర్యం ఇవ్వాలని, ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానన్నారు.