Liquor Shops To Increase In Telangana: తెలంగాణలో పెరుగనున్న మద్యం షాపులు, ప్రతి 14వేల మందికి ఒక షాపుకు అనుమతిచ్చేందుకు యత్నాలు
అడిగిందే తడవుగా లేదనకుండా ఏ4 ఎలైట్ మద్యం మాల్స్‌కు లైసెన్స్‌లు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సమాలోచనలు పూర్తి అయ్యాయి. ఇందుకోసం ఎక్సైజ్ నిబంధనల్లో ఉన్న జాతీయ నిష్పత్తి అనే అంశాన్ని అధికారులు తెరమీదకి తెచ్చారు.
Hyderabad, SEP 25: మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రభుత్వం కొత్త ఎత్తులు వేస్తున్నది. అడిగిందే తడవుగా లేదనకుండా ఏ4 ఎలైట్ మద్యం మాల్స్‌కు లైసెన్స్‌లు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సమాలోచనలు పూర్తి అయ్యాయి. ఇందుకోసం ఎక్సైజ్ నిబంధనల్లో ఉన్న జాతీయ నిష్పత్తి అనే అంశాన్ని అధికారులు తెరమీదకి తెచ్చారు. ఈ నిష్పత్తిని అమల్లోకి తెస్తే రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా పదివేలకుపైగా మద్యం దుకాణాలు తెరచుకోనున్నాయి. గత ప్రభుత్వం 2023 ఆగస్టులోనే ఏ4 మద్యంషాపులకు లైసెన్స్‌ల జారీ కోసం నోటిఫికేషన్ ఇచ్చి టెండర్లు కూడా ఖరారు చేసింది. గత సంవత్సరం డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఏ4 లైసెన్స్‌లు అమల్లోకి వచ్చాయి. ఇదే నెలలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కొత్త మద్యం దుకాణాలు తెరవకుండా ఆపడానికి కొత్త ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేసింది కానీ, పాలసీ నిబంధనలు అంగీకరించలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడేనాటికే పాలసీ అమల్లోకి వచ్చింది కాబట్టి, నిబంధనల ప్రకారం 2025 నవంబర్ 31 వరకు పాత పాలసీ అమలులో ఉంటుంది. అప్పటివరకు కొత్తం మద్యం దుకాణాల ఏర్పాటుకు అవకాశం లేదు.
ఈ నేపథ్యంలో అధికారులు ఎక్సైజ్ నిబంధనల్లో ఉన్న జాతీయ నిష్పత్తి అంశాన్ని తెరమీదకు తెచ్చారు. దీని ప్రకారం ప్రతి 14 వేల మంది జనాభాకు ఒక మద్యం దుకాణాలు ఏర్పాటు చేయొచ్చని ఎక్సైజ్ అధికారులు నిర్ధారించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ పాలసీని రూపొందించాల్సిన అవసరం కానీ, క్యాబినెట్ సబ్ కమిటీ ఆమోదం కానీ అవసరం లేకుండా నేరుగా మద్యం దుకాణాలను అనుమతించవచ్చు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర జనాభా 3.5 కోట్లు. ఈ లెక్కల ప్రకారం 13,300 మద్యం దుకాణాల ఏర్పాటుకు అర్హత ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇవి పోనూ కొత్తగా 10,680 మద్యం దుకాణాలు ఏర్పా టు చేయడానికి అవకాశం ఉన్నట్టు ఎక్సైజ్ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రహస్య నివేదిక ఇచ్చినట్టు సమాచారం. ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం న్యాయ సలహా కోసం పంపగా వారు కొన్ని సూచనలు చేసినట్టు తెలిసింది.
మరోవైపు, గతంలో ఎక్సైజ్‌శాఖ ఆదాయ వనరుల సమీకరణపై ఏర్పాటైన మంత్రివర్గం ఉపసంఘం నిధులు ఎలా పెంచాలనే అంశంపై సుదీర్ఘంగా చర్చించింది. ఆరు గ్యారెంటీలకు సంబంధించిన నిధులు కూడా మద్యం నుంచే రాబట్టాలని ఎక్సైజ్ అధికారులకు దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,620 ఏ4 మద్యం దుకాణాలు, 1,200 బార్లు, క్లబ్బులు ఉన్నాయి. వీటి ద్వారా మద్యం క్రయ విక్రయాలు, అన్ని రకాల సుంకాలు కలుపుకొని రాష్ట్ర ఖజనాకు 2022లో రూ.32 వేల కోట్లు, 2023లో రూ.35 వేల కోట్ల ఆదాయం సమకూరింది. ప్రభుత్వం ఈ లక్ష్యాన్ని అదనంగా రూ.10 వేల కోట్లకు పెంచి.. రూ.45 వేల కోట్లు రాబట్టాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది.