Telangana RTC Stir: సీఎం డెడ్‌లైన్ పెట్టినా ఎవరూ విధుల్లో చేరే ప్రసక్తే లేదు, తేల్చిచెప్పిన ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి, తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని వెల్లడి
తాజా పరిణామాలపై చర్చిస్తున్నట్లు సమాచారం....
Hyderabad, November 04: నవంబర్ 5 వరకు ఉద్యోగాల్లో చేరాలని సీఎం కేసీఆర్ (CM KCR) స్వయంగా టీఎస్ ఆర్టీసీ కార్మికులకు డెడ్ లైన్ విధించినా, ఇప్పటివరకు ఎవరూ విధుల్లో చేరలేదని ఆర్టీసీ ఐకాస (TSRTC JAC) కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి (Ashwatthama Reddy) సోమవారం స్పష్టం చేశారు. 11 మంది ఉద్యోగాల్లో చేరినట్లు వార్తలు వచ్చినా, తిరిగి అందులోంచి కొంతమంది వెనక్కి వచ్చేశారని ఆయన తెలిపారు.
సీఎం కేసీఆర్ డెడ్‌లైన్ నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాలు సోమవారం వేర్వేరుగా సుదీర్ఘ సమావేశాలు నిర్వహించుకున్నాయి. ఈ సమావేశాల అనంతరం ఐకాస కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సమ్మెను యధావిధిగా కొనసాగించాలని 97 డిపోల కార్మికులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారని ఆయన వెల్లడించారు. "సీఎం పిలుపిచ్చినా ఎవరూ చేరలేదు, చేరే ప్రసక్తే లేదు" అని అశ్వత్థామ రెడ్డి తేల్చిచెప్పారు.
ఆర్టీసీ జేఏసీని ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించాలి, చర్చలు జరిపితేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. తమతో చర్చలు జరిపితే సమ్మెను విరమిస్తాం అని అశ్వత్థామ రెడ్డి తెలియజేశారు. సమస్యల పరిష్కారం కాకుండా, బేషరతుగా విధుల్లో చేరేందుకు కార్మికులెవరూ అంగీకరించడం లేదని ఆయన స్పష్టం చేశారు.
మంగళవారం అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఉంటుంది, రేపు అన్ని బస్ డిపోల ముందు మానవహారం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అశ్వత్థామ రెడ్డి వెల్లడించారు. అయితే తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు, ఆర్టీసీ సమ్మె - ఉద్యోగుల చేరిక తదితర అంశాలపై సీఎం కేసీఆర్, రవాణామంత్రి మరియు అధికారులతో మరోసారి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. తాజా పరిణామాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం తరఫున కేంద్రానికి లేఖ రాయాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది.