COVID-19: తెలంగాణలో ఉండే పొడి వాతావరణంలో కరోనావైరస్ మనుగడ సాధించలేదు, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం సిద్ధంగా ఉంది, వెల్లడించిన మంత్రివర్గ ఉపసంఘం
కరోనావైరస్ ఎక్కువగా తేమ మరియు చల్లని ప్రదేశాలలో వ్యాప్తి చెందుతుంది. తెలంగాణలో అలాంటి వాతావరణమే లేదు.....
Hyderabad, March 3: రాష్ట్రంలో (Telangana) కరోనావైరస్ కేసు (COVID 2019) నమోదైన నేపథ్యంలో, వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం సమన్వయ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి మంత్రులు ఈటల రాజేంధర్, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ కార్యదర్శి సోమేష్ కుమార్ మరియు ఆయా విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన చర్యలు, అనుమానితులకు వైద్య పరీక్షలు మరియు ప్రజలలో అవగాహన పెంచడంతో పాటు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై చర్చించారు. వ్యాధి లక్షణాలు గమనించిన వారి సహాయార్థం 24 గంటల ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయాలని మంత్రులు నిర్ణయించారు. తెలంగాణలో కరోనావైరస్ కేసుతో అప్రమత్తమైన రెండు రాష్ట్రాలు
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ కరోనావైరస్ గురించి ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. కరోనాను నియంత్రించడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. వైరస్ సోకితే చనిపోతారన్న వార్తల్లో కూడా నిజం లేదు, గతంలో వ్యాప్తి చెందిన వైరస్ లతో పోల్చితే కోవిడ్ 19 మరణాల రేటు తక్కువ అని మంత్రులు గుర్తు చేశారు. కరోనావైరస్ పట్ల ఎవరైనా దుష్ప్రచారం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని ఈ సందర్భంగా మంత్రివర్గ ఉపసంఘం హెచ్చరించింది.
High-level Review Meeting Over Coronavirus Outbreak:
అంతకుముందు, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేంధర్ మాట్లాడుతూ తెలంగాణలో ఉండే వేడి, పొడి వాతావరణంలో వైరస్ సజీవంగా ఉండే అవకాశమే లేదని అభిప్రాయపడ్డారు. కరోనావైరస్ ఎక్కువగా తేమ మరియు చల్లని ప్రదేశాలలో వ్యాప్తి చెందుతుంది. తెలంగాణలో అలాంటి వాతావరణమే లేదు కాబట్టి ఏ వైరస్ మనుగడ సాధించలేదని, అయినప్పటికీ ప్రభుత్వం అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుందని ఆయన వివరించారు.