Weather Forecast: తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు, రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం

నిన్న రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసిన వర్షంతో వాతావరణం కూల్ అయ్యింది. అయితే ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న గాలులతో తెలంగాణకు మరో నాలుగు రోజుల పాటు వర్షాలు (Rains in the Telangana State) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ( Hyd Weather Department) తెలిపింది.

Rains (Photo Credits: PTI)

Hyd, April 22: నిన్న మొన్నటి వరకు రికార్డు స్థాయిలో నమోదైన టెంపరేచర్లు కాస్త తగ్గాయి. నిన్న రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసిన వర్షంతో వాతావరణం కూల్ అయ్యింది. అయితే ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న గాలులతో తెలంగాణకు మరో నాలుగు రోజుల పాటు వర్షాలు (Rains in the Telangana State) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ( Hyd Weather Department) తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. రాష్ట్రంలో గురువారం వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఒకవైపు ఎండ హోరెత్తిస్తుంటే మరోవైపు వర్షాలు పడ్డాయి. ఉదయం ఎండ దంచికొట్టగా.. సాయంత్రం అయ్యేసరికి వాతావరణం పూర్తిగా చల్లబడి వర్షం కురిసింది. ఆదిలాబాద్ లోని జైనథ్ లో 45 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.

హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గురువారం (ఏప్రిల్ 21) వర్షం కురిసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆలియాబాద్ లో 4.8 సెంటీమీటర్ల వర్షం పడింది. హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. భారీ వర్షం కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన పలు విమానాలను బెంగళూరు, నాగ్‌పూర్‌కు మళ్లించారు. రాత్రి 8 గంటల తర్వాత విమాన రాకపోకలు తిరిగి యథావిధిగా సాగినట్లు తెలుస్తోంది.

ఈ సంవత్సరంలో అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు బుధవారంనాడు నమోదైన తర్వాత, తెలంగాణ, హైదరాబాద్‌లో గురువారం ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిశాయి. టీఎస్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్) లెక్కల ప్రకారం గురువారం సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాద్‌లో అత్యధికంగా బోరబండలో 13 మిల్లీమీటర్ల వర్షం పడగా, రాష్ట్రవ్యాప్తంగా ములుగు మండలం సిద్దిపేటలో 40 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఖైరతాబాద్, షేక్‌పేట, టోలీచౌకి, బండ్లగూడలో సాయంత్రం 13, 7.5, 5, 3.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

అయితే తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు (Next 4 Days) పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30 కిలో మీటర్ల నుంచి 40 కిలో మీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయంటూ అధికారులు తెలిపారు.