Hyderabad Vet Rape and Murder Case: ఆ నలుగురు నిందితుల తరఫున వాదించవద్దని బార్ అసోసియేషన్ తీర్మానం, 10 రోజుల కస్టడీ కోరిన షాద్‌నగర్ పోలీసులు, విచారణ రేపటికి వాయిదా వేసిన కోర్ట్
బార్ అసోసియేషన్ తీర్మానం మేరకు నిందితుల తరఫున ఎవరూ కౌంటర్ దాఖలు చేయలేదు. ఈ నేపథ్యంలో నిందితులను కస్టడీకి ఇచ్చే విషయంలో కోర్టు విచారణ సాగుతోంది....
Shadnagar, December 2: యువ వెటర్నరీ డాక్టర్ దిశ (26) (Disha) పై దారుణానికి పాల్పడిన నలుగురు నిందితుల పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. నిందితులకు తక్షణమే శిక్షలు ఖరారు చేయాలని, తీవ్రమైన శిక్షలు విధించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితుల తరఫున ఏ లాయర్ కూడా వాదించకూడదని బార్ అసోసియేషన్ (Bar Association) ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న మహ్మద్ పాషా అలియాస్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చిన్నకేశవులను తమకు 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాల్సిందిగా షాద్ నగర్ పోలీసులు పిటిషన్ వేశారు. నిందితులు గతంలో ఇంకా ఏమైనా ఇలాంటి నేరాలకు పాల్పడ్డారా అని తేల్చేందుకు విచారణకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించి త్వరగా శిక్ష అమలు చేసేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు.
ఈ పిటిషన్ పై షాద్ నగర్ కోర్టు (Shadnagar Court)లో సోమవారం విచారణ జరిగింది. బార్ అసోసియేషన్ తీర్మానం మేరకు నిందితుల తరఫున ఎవరూ కౌంటర్ దాఖలు చేయలేదు. ఈ నేపథ్యంలో కోర్ట్ విచారణను రేపటికి వాయిదా వేసింది.
గత బుధవారం రాత్రి తొండుపల్లి టోల్ గేట్ వద్ద ఒంటరిగా కనిపించిన వెటర్నరీ డాక్టర్ దిశను లారీ డ్రైవర్లు, క్లీనర్లుగా పనిచేసే మహ్మద్ పాషా, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చిన్నకేశవులు సహాయం చేస్తామని చెబుతూ ఆ యువతిని తప్పుదోవ పట్టించారు. అనంతరం ఆమెను రోడ్డు పక్కకు బలవంతంగా లాక్కెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారం చేయడమే కాకుండా, హత్య చేసి ఆపై శవాన్ని పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సమాజాన్ని తలదించుకునేలా చేసిన ఈ నలుగురు ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వారిపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 376D (గ్యాంగ్ రేప్), సెక్షన్ 302 (హత్య), సెక్షన్ 201 (సాక్ష్యాధారాలను నాశనం చేయడం) ప్రకారం పోలీసులు కేసులు నమోదు చేశారు.