Suspicious death: షేక్‌పేట మాజీ ఎమ్మార్వో సుజాత అనుమానాస్పద మృతి
శుక్రవారం సాయంత్రం గుండెపోటుతో నిమ్స్ ఆసుపత్రిలో చేరిన సుజాత శనివారం కన్నుమూశారు.
Hyderabad, September 3: షేక్‌పేట మాజీ ఎమ్మార్వో సుజాత అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శుక్రవారం సాయంత్రం గుండెపోటుతో నిమ్స్ ఆసుపత్రిలో చేరిన సుజాత శనివారం కన్నుమూశారు. సుజాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14 లోని రూ. 40 కోట్ల విలువైన ల్యాండ్ కేసులో లంచం తీసుకున్నట్లు ఆరోపణలు రావడం, ఇంట్లో దొరికిన రూ.30 లక్షలకు సరైన ఆధారాలు చూపకపోవడం, ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో ఆమె గతంలో అరెస్టయ్యారు. కోర్టు విచారణలో ఉన్న భూమిని ఖాలిద్ అనే వ్యక్తికి అనుకూలంగా రికార్డు తయారు చేసేందుకు లంచం తీసుకున్న ఆరోపణలతో ఏసీబీ ఆమెను విచారించింది. 2020 జూన్ నెలలో సుజాత భర్త అజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. సోదరి ఇంటి భవనంపై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నారు.
భార్యపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి సుజాత భర్తను కూడా అప్పట్లో ఏసీబీ అధికారులు విచారించారు. ఏసీబీ వేధింపుల వల్లే అజయ్ సూసైడ్ చేసుకున్నాడని అప్పట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఆరోపించారు. అప్పటి నుంచి తీవ్రమైన మానసిక క్షోభతో బాధపడుతున్న సుజాతకు మళ్లీ విధుల్లోకి చేరేందుకు అవకాశం ఇచ్చినా ఆమె తిరస్కరించారు. ఈ క్రమంలోనే డిప్రెషన్‌లోకి వెళ్లిన సుజాత.. ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తొలుత ప్రచారం జరిగింది. అయితే తాజాగాకు ఆమె గుండెపోటుతో మృతిచెందినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.