Telangana Assembly Session 2024: తెలంగాణలో మన్మోహన్‌ సింగ్ విగ్రహం ఏర్పాటు, అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, కేంద్రం భారతరత్న ఇవ్వాలని డిమాండ్

సభ్యులంతా మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళులు అర్పించారు.

BRS Govt Provided Rythu Bharosa To Uncultivated Lands Says CM Revanth Reddy(video grab)

Hyd, Dec 30: తెలంగాణ ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది.మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానాన్ని శాసన సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. సభ్యులంతా మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళులు అర్పించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ (Manmohan Singh) ఆర్థిక సంస్కరణల రూపశిల్పి అని కొనియాడారు. ఎల్పీజీ, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్‌తో సరళీకృత విధానాలను తీసుకొచ్చి ప్రపంచంతోనే పోటీపడేలా దేశాన్ని తీర్చిదిద్దారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

కేంద్ర ఆర్థిక శాఖ సలహాదారుగా, ఆర్బీఐ గవర్నర్‌గా, ప్రణాళిక సంఘం డిప్యూటీ ఛైర్మన్‌గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా దేశానికి సేవలందించారని పేర్కొన్నారు. 1991-96 మధ్య దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయన ఊపిరిలూదారని సీఎం అసెంబ్లీలో వివరించారు.తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలోనూ ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ వేసిన పునాదుల వల్లే నేడు ప్రపంచంతో భారత్ పోటీ పడుతోందని ఆయన చెప్పుకొచ్చారు.తెలంగాణలో మన్మోహన్‌ను విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి సంచలన ప్రకటన చేశారు. మాజీ ప్రధాని విగ్రహం తెలంగాణ ప్రజల్లో స్ఫూర్తి నింపుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

సాగు చేసే వారికే రైతు భరోసా...స్పష్టం చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సర్వే నెంబర్ల వారిగా సాగు వివరాలు సేకరిస్తున్నామని వెల్లడి

‘‘మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. 2014లో ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది. ఎన్నో ఏళ్ల పోరాట ఫలితంగా తెలంగాణ ఏర్పడింది. మన్మోహన్‌ సింగ్‌ ఎల్‌పీజీ విధానాలతో భారత ఆర్థిక వ్యవస్థను స్థిరంగా నిలిపారు. 2004-14 మధ్య ప్రధానిగా అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. ఉపాధిహామీ, ఆర్టీఐ, ఎన్‌హెచ్‌ఆర్‌ఎంను ప్రారంభించారు. ఆర్థిక స్థితిగతులు మార్చే నిర్మాణాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టారు.

సామాజిక విప్లవ కార్యక్రమమైన ఆధార్‌ను మన్మోహన్‌ ప్రారంభించారు. సరళీకృత ఆర్థిక విధానాలు తెచ్చి ప్రపంచంతో పోటీపడేలా పునాది వేశారు. ఆయన సేవలు భావితరాలు గుర్తుంచుకోవాలి. ఆయనకు భారతరత్న ఇవ్వాలని ఈ సభ తీర్మానం చేస్తోంది. ప్రపంచం గర్వించదగ్గ ఆర్థికవేత్త మన్మోహన్‌ సింగ్‌ మృతి దేశానికి తీరని లోటు. ఆయన నీతి, నిజాయతీ, నిబద్ధత కలిగిన నేత. జీవితాన్ని దేశానికి అంకితం చేసిన గొప్ప వ్యక్తి. ప్రధాని సహా అనేక హోదాల్లో ఉన్నా నిరాడంబరంగా జీవించారు. ఉపాధిహామీ పథకాన్ని అనంతపురం, మహబూబ్‌నగర్‌ నుంచి ప్రారంభించారు.

2013లో భూసేకరణ చట్టం తెచ్చి నిరుపేదలకు న్యాయం జరిగేలా చేశారు. 2006లో అటవీ హక్కుల చట్టానికి సవరణలు చేసి ఆదివాసీలను ఆదుకున్నారు. ఐటీ రంగంలో శాసించగలుగుతున్నామంటే మన్మోహన్‌ విధానాలే కారణం. ఆయన తెలంగాణకు ఆత్మబంధువు. 60 ఏళ్ల తెలంగాణ కలను సాకారం చేసిన నాయకుడు. తెలంగాణ బిల్లులను 2 సభల్లో పాస్‌ చేయించిన సారథి. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో మన్మోహన్‌ సింగ్‌ విగ్రహం ఏర్పాటు చేస్తాం’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.

మన్మోహన్‌ సింగ్‌ సరళీకృత ఆర్థిక విధానాలతో దేశాన్ని బలమైన శక్తిగా నిలిపారని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అసమానతలు, సామాజిక పరిస్థితి అర్థం చేసుకుని చట్టాల ద్వారా ప్రజల్లో ధైర్యం నింపారన్నారు. మానవతా ప్రమాణాలు నెలకొల్పిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. చేపట్టిన ప్రతి పదవికీ వన్నె తెచ్చారని చెప్పారు. పాలనాపరమైన అంశాలను సామాన్యుడూ తెలుసుకునేలా 2005లో ఆర్టీఐ తెచ్చారని గుర్తుచేశారు. ఆయన తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకం దేశ గతినే మార్చేసిందని పేర్కొన్నారు. మానవతా ప్రమాణాలు నెలకొల్పిన గొప్ప వ్యక్తి మన్మోహన్‌ సింగ్‌ అని భట్టి విక్రమార్క చెప్పారు.