Telangana: రాబోయే రోజుల్లో కరోనాను మించిన వైరస్‌లు, రాష్ట్రంలో వైద్యరంగాన్ని బలోపేతం చేస్తున్నామని తెలిపిన సీఎం కేసీఆర్, నిమ్స్ దశాబ్ది బ్లాక్ నిర్మాణానికి శంకుస్థాపన
అనంతరం మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో కరోనాను మించిన వైరస్‌లు వస్తాయని నిపుణులు చెప్పారన్నారు.
Hyd, June 13: హైదరాబాద్‌లో నిమ్స్ దశాబ్ది బ్లాక్ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో కరోనాను మించిన వైరస్‌లు వస్తాయని నిపుణులు చెప్పారన్నారు. వైద్యరంగం బలంగా ఉన్న చోట తక్కువ నష్టంతో బయటపడుతారని చెప్పారని తెలిపారు. అందుకే వైద్యరంగాన్ని రాష్ట్రంలో బలోపేతం చేస్తున్నామని సీఎం వెల్లడించారు.
వైద్యానికి మానవ జీవితానికి ఎడతెగని సంబంధం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. మానవజాతి ఉన్నంత కాలం వైద్యులు ఉంటారని చెప్పారు. అప్పు ఇచ్చు వాడు ఉండాలి.. వైద్యులు ఉండాలని గతంలో కవులు చెప్పారన్నారు. తెలంగాణ వచ్చాక ఆరోగ్యశాఖ అతికీలకమైనదిగా భావించామని తెలిపారు. 2014లో వైద్యరంగానికి బడ్జెట్‌లో రూ.2001 కోట్లు కేటాయించామని, 2023-24 నాటికి అది రూ.12,367 కోట్లకు చేరిందని వెల్లడించారు. వైద్యరంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. 550 టన్నుల ఆక్సిజన్‌ను సొంతంగా ఉత్పత్తి చేసుకుంటున్నామని చెప్పారు.
పిల్లల పెరుగుదలలో సమస్యలు ఉండకూడదని న్యూట్రిషన్ కిట్లు అందిస్తున్నామని సీఎం చెప్పారు. న్యూట్రిషన్ కిట్ ఇవ్వడం వెనుక చాలా ఆలోచన ఉందని సీఎం అన్నారు. ఈ కిట్లతో ఒక తరం ఆరోగ్యకరంగా ఉంటుందని వెల్లడించారు. వైద్యారోగ్యశాఖకు సహజంగా విమర్శలే ఎక్కువగా ఉంటాయని, ప్రశంసలు తక్కువన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సామర్థ్యానికి మించి రోగులు వచ్చినా డాక్టర్లు వైద్యం అందిస్తున్నారని తెలిపారు. మూరుమూల ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ప్రత్యేక సౌకర్యాలు అందిస్తున్నామని వెల్లడించారు. గతంలోఆస్పత్రుల్లో 30 శాతం డెలివెరీలు జరిగేవని, ఇప్పుడు 70 శాతానికి పెరిగాయన్నారు.
వైద్యారోగ్య రంగంపై చక్కటి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. గతంలో ఉస్మానియా, గాంధీ, నోలోఫర్ వంటి ఆస్పత్రులే దిక్కని, ఇప్పుడు వరంగల్‌లో ప్రపంచంలో లేని అద్భుతమైన హెల్త్ సిటీని కడుతున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో మరో నాలుగు హాస్పిటళ్లు కడుతున్నామని వెల్లడించారు. రాష్ట్ర ప్రజలకు ఉత్తమ సేవలు అందించడానికి కృషి చేస్తున్నామని అన్నారు.
కరోనా సమయంలో గాంధీ ఆస్పత్రి అద్భుతమైన సేవలు అందించిందని చెప్పారు. ప్రైవేటు హాస్పిటళ్లు చేతులెత్తేసినా కరోనా రోగులను గాంధీ వైద్యులు కాపాడారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా గాంధీ సూపరింటెండెంట్ రాజారావు, వైద్యులు, సిబ్బందిని ముఖ్యమంత్రి అభినందించారు. అందరికి తెలంగాణ దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు