Gaddar Award: ఇకపై ప్రతీ సంవత్సరం నంది అవార్డులు ఇస్తామంటూ రేవంత్ రెడ్డి ప్రకటన, పురస్కారం పేరు మార్చుతూ త్వరలోనే జీవో జారీ
నేడు జనవరి 31న గద్దర్ జయంతి కావడంతో ఆయనకి నివాళులు అర్పిస్తూ రేవంత్ రెడ్డి (Revanth reddy).. ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
Hyderabad, JAN 31: తెలుగు సినీ కళాకారులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే పురస్కారం ‘నంది అవార్డు’ (Nandi Award). సినిమా రంగంలోని అత్యుత్తమ ప్రతిభను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డుని అందిస్తూ ఉంటుంది. అయితే ఈ పురస్కారం గత కొంతకాలంగా నిలిచిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తరువాత ఈ అవార్డుల పురస్కారం పట్ల నిర్లక్ష్యం మొదలయింది. ఇక 2017 నుంచి అయితే రెండు తెలుగు రాష్ట్రాలు నంది అవార్డులు ఇవ్వడం ఆపేసాయి. అప్పటినుంచి నిలిచిపోయిన నంది పురస్కారాన్ని మళ్ళీ మొదలు పెట్టాలని.. ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు రెండు ప్రభుత్వాలని కోరుతూనే వచ్చారు. అయితే ప్రభుత్వాలు మాత్రం ఈ పురస్కారాన్ని మళ్ళీ మొదలు పెడతాం అన్న మాట దగ్గరే ఆగిపోయాయి.
అయితే ఈ నంది అవార్డుల ప్రకటించడం విషయంలో.. ప్రభుత్వాల దగ్గర ఓ సందేహం నెలకుంది. రెండు రాష్ట్రాలు ఒకటిగా ఉన్నప్పుడు నంది పేరుతో ఇచ్చిన అవార్డులను.. ఇప్పుడు ఏ పేరుతో ఇవ్వాలనే డౌట్ ఉంది. గత తెలంగాణ ప్రభుత్వం (BRS) సింహ అవార్డులతో ఇస్తామంటూ.. అప్పటిలో ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో పేరుని తెరపైకి తీసుకు వచ్చింది.
తెలంగాణలో నంది అవార్డులను ఇక నుంచి ‘గద్దర్ అవార్డు’ (Gaddar Award) పేరుతో ఇస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. నేడు జనవరి 31న గద్దర్ జయంతి కావడంతో ఆయనకి నివాళులు అర్పిస్తూ రేవంత్ రెడ్డి (Revanth reddy).. ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇదే నా శాసనం. ఇదే జీవో అంటూ ప్రకటించారు. త్వరలోనే ఈ పేరు మార్పు పై జీవోని జారీ చేయనున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి గద్దర్ ప్రతీ జయంతికి ఈ పురస్కార ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు.