Rythu Bandhu: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్, ఈ నెల 28 నుంచే రైతుబంధు, సంక్రాంతి కల్లా అందరికీ అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు
ఈ ఏడాది యాసంగి రైతుబంధుకుగానూ రూ. 7600 కోట్లను రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం (TS Govt) జమ చేయనున్నది.
Hyderabad, DEC 18: తెలంగాణ రైతాంగానికి సీఎం కేసీఆర్ శుభవార్తను ప్రకటించారు. ఆర్ధిక ఇబ్బందులున్నప్పటికీ రైతులను ఆదుకునే మహత్తర లక్ష్యంతో యాసంగి పంట కాలానికి అందించే పంట పెట్టుబడి రైతుబంధు (Rythu Bandhu) నిధులను ఈనెల 28 నుంచి విడుదల చేయాలని నిర్ణయించారు. రైతులకు అప్పటినుంచి దశలవారీగా రైతుబంధు నిధుల జమను ప్రారంభించాలని, ఆర్థిక శాఖ మంత్రి #హరీశ్ రావును సీఎం కేసిఆర్ (CM KCR) ఆదేశించారు. యాసంగి (Yasangi) పంట సాయంగా రైతు బంధు నిధులు, ఎప్పటిలాగే ఒక ఎకరం నుంచి ప్రారంభమై సంక్రాంతి కల్లా రైతులందరి ఖాతాల్లో జమ కానున్నాయి. రైతులకు పెట్టుబడి ఇబ్బందులు తొలగిపోయి వారికి నిజమైన సంక్రాంతి నిశ్చింతగా జరుపుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది యాసంగి రైతుబంధుకుగానూ రూ. 7600 కోట్లను రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం (TS Govt) జమ చేయనున్నది. రైతు బంధు పథకం ద్వారా రైతులకు వానాకాలం, యాసంగి రెండు కాలాలకు ఎకరానికి రూ. 10వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం, పంట పెట్టుబడిని అందించడం, దేశ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక కార్యాచరణగా సత్ఫలితాలనిస్తున్నది. రైతులకు మద్దతిచ్చేందుకు దేశంలో ప్రవేశపెట్టిన తొలి పథకం ఇదే కావడం గమనార్హం. విత్తనాలు, ఎరువులు, రసాయనాలు కొనుగోలు చేసేందుకు, ఇతరత్రా అవసరాలకు రైతుల చేఊతికి నగదును ప్రభుత్వం అందిస్తున్నది.
గ్రామాల్లో వ్యవసాయ ఉత్పత్తిని మరింత ప్రోత్సహించి, రైతుల ఆదాయం పెఉంచేందుకు నగదు రూపంలో ఆర్ధిక సాయం అందించే లక్ష్యంతో ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ 2018 ఫిబ్రవరి 25న ప్రకటించి, 2018 మే 10న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం ధర్మరాజుపల్లిలో ప్రారంభించారు. 2021-22కు మొత్తంగా రూ. 54వేల కోట్లను రైతు ఖాతాల్లోకి ప్రభుత్వం నగదును జమ చేసింది. 60లక్షలకుపైగా రైతులు 1.43 కోట్ల ఎకరాలకు చెందిన భూములకు రైతుబంధును పొందుతున్నారు. తెలంగాణలోని సుమారు 55 శాతంమంది జనాభా వ్యవసాయంపసై ఆధారపడి జీవిస్తోండగా, వారందరికి 90.5శాతానికిపైగా పేదలకు ఈ పథకంతో ప్రయోజనం పొందుతున్నారు.
లక్షలాది మంది రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతుబంధు పెట్టుబడి సొమ్ము ఈ నెల 28నుంచి రైతులకు అందనుండటంతో రాష్ట్రవ్యాప్తంగా రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రైతులు సంతృప్తిగా ఉంటేనే ఈ రంగంలో ఎంచుకున్న లక్ష్యాలను సాధించగలమన్న కోణంలో సర్కార్ చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే నిధులలేమి ఉన్నప్పటికి, కేంద్రం కోతలు పెడుతున్నప్పటికీ ప్రభుత్వం వెరవకుండా రైతుబంధు నిధులను సాధ్యమైనంత త్వరలో రైతులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.